అవినీతి నోట్ల కట్టల పాము.. ఇంట్లోనే రూ.2.93 కోట్ల నగదు
ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంటిపైనా దాడులు నిర్వహించింది.
By: Tupaki Desk | 10 Aug 2024 12:30 AM GMTపేదల ఇంట్లో లిక్విడ్ క్యాష్ ఎంతుంటుంది..? పోనీ.. మధ్య తరగతి ఇంట్లో..? వీరెవరూ కాక అత్యంత సంపన్నుల ఇంట్లో అయితే ఎంత లిక్విడ్ క్యాష్ ఉంటుంది.. ఒక కోటి రూపాయిలు ఉంటుందేమో..? కానీ.. ఆ అధికారి ఇంట్లో ఏకంగా రూ.3 కోట్ల వరకు నగదు దొరికింది.. ఆయనేమీ జిల్లా అంతటికీ ఉన్నతాధికారి ఏమీ కాదు.. రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారీ కాదు.. ఇదంతా నిజమాబాద్ లో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగానూ కలకలం రేపుతోంది.
జూలు విదిల్చిన ఏసీబీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పెద్దఎత్తున దాడులు చేస్తోంది. లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. ఇలా రోజుకో అధికారి పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంటిపైనా దాడులు నిర్వహించింది. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్లు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
అక్రమాస్తులు రూ.6.07 కోట్లు.. నగదు 3 కోట్లు..
నరేందర్ కు రూ.6.07 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులోనే రూ.2.93 కోట్ల నగదు కావడం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ.. నరేందర్ ఇంట్లో సోదాలకు దిగింది. ఆయన ఇల్లు, కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లీ, నిర్మల్ లోని నరేందర్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. నిజామాబాద్ వినాయక్‌నగర్ లోని అశోకా టవర్ లో ఉన్న ఇంట్లోనే రూ.2.93 కోట్ల నగదును గుర్తించారు. నరేందర్ భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.10 కోట్ల నగదు, 51తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.98 కోట్లు విలువైన 17 స్థిరాస్తులను గుర్తించారు. నరేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కొన్ని నెలల కిందట జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయన ఇంట్లో దొరికిన నగదు తక్కువే. కానీ, నరేందర్ ఇంట్లో మాత్రం కట్టలు కట్టలు బయటపడ్డాయి.