ఓరుగల్లులో కొండా, రేవూరి పోరు 'చేతి'కి చేటా ?!
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ కొండా వర్గీయులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
By: Tupaki Desk | 10 May 2024 3:00 AM GMTవరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తెస్తామన్న కాంగ్రెస్ నేతలు అంతర్గత విభేదాలతో అలజడి రేపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త చేరికలు నాయకుల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన అనంతరం అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేయించుకున్నాడు. బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ తరపున జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను బరిలోకి దించారు.
ఇలాంటి కీలక సమయంలో నాయకుల మధ్య విభేదాలు కాంగ్రెస్ లో కలవరం రేపుతున్నాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మంత్రి కొండా సురేఖను ఆహ్వానించకపోవడంతో ఆమె వర్గీయులు భగ్గుమన్నారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ కొండా వర్గీయులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి సురేఖ వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగి పోయిన కొండా వర్గీయులు కొందరు రోడ్డెక్కి ధర్నా చేశారు.
పొరుగు నియోజక వర్గం నుండి పరకాలకు వలస వచ్చిన రేవూరిని గెలిపిస్తే తమను తొక్కేస్తున్నాడని కొండా అనుచరులు ఆరోపిస్తున్నారు.రాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు భరత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. గతంలో కొండా దంపతులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న భరత్ ఎన్నికల తర్వాత తిరిగి కొండా సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. దీనిపై రేవూరి అసంతృప్తితో ఉన్నాడు.
ఈ విషయంలో రేవూరి, మంత్రి కొండా సురేఖల మధ్య జరిగిన ఆడియో సంభాషణ కలకలం రేపింది. తమ నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొండా సురేఖ హెచ్చరించింది. దానికి రేవూరి ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.