Begin typing your search above and press return to search.

ప్రశ్నలు అడగటం సరే.. వివరాలు తెలుసుకోకుండా ఈ మాటలేంది వర్మ?

ఆయన వాదనా పటిమకు ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం మనసులో మాత్రం ముచ్చట పడిపోతుంటారు

By:  Tupaki Desk   |   14 Dec 2024 3:36 AM GMT
ప్రశ్నలు అడగటం సరే.. వివరాలు తెలుసుకోకుండా ఈ మాటలేంది వర్మ?
X

తన వాదనతో ఎదుటోడ్ని ఇట్టే ఇంప్రెస్ చేసే కళ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు టన్నుల కొద్దీ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన వాదనా పటిమకు ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం మనసులో మాత్రం ముచ్చట పడిపోతుంటారు. దీనికి కారణం ఆయన వాదనలో ఉండే తర్కం. అదే.. ఆయన్ను అభిమానించేలా చేస్తుంది. తాను స్పందించాల్సిన అంశంపై తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలతో సమాధానాల్ని సంధించటం ఆర్జీవీకి అలవాటు. అయితే.. ఆయనకు మరో అలవాటు ఉంది. ఎవరిని ప్రశ్నించాలో.. ఎవరి విషయంలో మౌనంగా ఉండాలో ఆయనకు బాగా తెలుసు.

తాజాగా అరెస్టు అయిన అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించి ఎప్పటిలానే ఆర్జీవీ తనదైన వాదనా పటిమతో నాలుగు ప్రశ్నలు అడిగారు. అవి చదివిన వారు కానీ విన్నోళ్లు కానీ.. నిజమే కదా? అల్లు అర్జున్ ను ఇంత అన్యాయంగా అరెస్టు చేస్తారా? అనుకోకుండా ఉండలేరు. అయితే.. ఆయన వినిపించే వాదనలో డొల్లతనం.. ఆ ఘటనపై అవగాహన ఉన్నోళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అదెలా ఉంటుందన్నది ఈ కథనం పూర్తిగా చదివితే ఇట్టే అర్థమవుతుంది.

వర్మ అడిగిన నాలుగు ప్రశ్నల్ని మొదట చెప్పేసి.. తర్వాత విషయంలోకి వెళితే.. ఆర్జీవీ వాదన పస ఎలా ఉంటుందో అర్థం కావటమే కాదు.. అతగాడి తెలివికి ఔరా అనుకోకుండా ఉండలేం.

1. పుష్కరాలు.. బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా?

2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకుల్ని అరెస్టు చేస్తారా?

3. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎవరైనా చనిపోతే హీరో.. హీరోయిన్లను అరెస్టు చేస్తారా?

4. భద్రత ఏర్పాట్లను పోలీసులు.. నిర్వాహకులు తప్ప హీరోలు.. నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?

వర్మ సంధించిన ప్రశ్నలు చదివినంతనే.. ‘నిజమే కదా. ఆయన మంచి పాయింట్లే చర్చకు లేవనెత్తారు?’ అనుకోకుండా ఉండలేం. ఇక్క వర్మ అడిగిన ప్రశ్నలు.. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ అంశానికి ఎంతవరకు కరెక్టు అవుతుందో ఒక్కసారి చెక్ చేస్తే విషయం మీకే అర్థమవుతుంది. వర్మ అడిగిన మొదటి ప్రశ్నను తీసుకుంటే.. అదంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసి అడిగిన వైనం ఇట్టే అర్థమవుతుంది. పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా? అని. అంటే.. అల్లు అర్జున్ ను ఆర్జీవీ దేవుడిగా భావిస్తున్నారా? ఆయన అడిగినట్లుగా అలాంటిదే జరిగినప్పుడు.. దానికి కారణమైన వారిని బాధ్యుల్ని చేస్తారు. అంటే.. పోలీసుల వైఫల్యం కానీ.. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని కానీ ఆ మరణాలకు కారణమవుతారు.

వర్మ అడిగిన రెండో ప్రశ్నను తీసుకుంటే.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో చోటు చేసుకునే మరణం కూడా దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులో వారంతా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. మూడో ప్రశ్నను తీసుకుంటే.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో చనిపోతే.. హీరో హీరోయిన్లను అరెస్టు చేస్తారా? అన్నది చూస్తే.. కాదనే చెప్పాలి. దానికి బాధ్యులైన నిర్వాహకుల్ని ప్రశ్నిస్తారు. కేసులు కడతారు. నాలుగో ప్రశ్నతో పాటు.. వర్మ అడిగిన మిగిలిన మూడు ప్రశ్నల్లో ఆయన మిస్ అయిన పాయింట్ ఏమంటే.. పుష్ప 2 బెనిఫిట్ షో వేళ.. చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మరణించటం.. మరో బాలుడు ఇప్పటికి ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద.. స్ప్రహ లేకుండా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11 అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా.. ఆయన్ను ఏ11గా చూపించనప్పుడే మాట్లాడాలి. మరి.. అప్పుడు మౌనంగా ఉండి.. చర్యలు ప్రారంభమైనంతనే ప్రశ్నలు అడగటంలో ఔచిత్యం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఇక..తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యత ఏంటి?అంటే.. చాలామంది (ప్రతి వంద మందిలో 99 మంది మిస్ అవుతున్న) మిస్ అవుతున్న పాయింట్.. అసలు ఆ రోజేం జరిగింది? అన్న దానిపై అవగాహన లేకపోవటం.

సంధ్య థియేటర్ కు తన కారులో వచ్చిన అల్లు అర్జున్.. థియేటర్ లోకి నేరుగా వెళ్లి ఉంటే.. తొక్కిసలాటకు ఆయన బాధ్యత ఇసుమంత కూడా ఉండదు. కానీ.. ఆయన థియేటర్కు 100 - 200 అడుగుల ముందు కారు ఆపారు. తన కారు సన్ రూఫ్ మార్గం నుంచి బయటకు వచ్చి.. అక్కడ చేరిన వేలాది మంది అభిమానులను ఉత్సాహ పరిచేలా చేతులు ఊపారు. దీంతో.. ఆయన్ను ఫోటోలు తీయటానికి.. ఆయన్ను చూసేందుకు ఒక్కసారిగా అక్కడకు దూసుకెళ్లారు. ఇక్కడే మరో తప్పు జరిగింది.

అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ బన్నీ వాహనం వద్దకు దూసుకొచ్చే వారిని పక్కకు తోసేశారు. ఇదే తొక్కిసలాటకు ప్రధాన కారణం. ఈ టైంలో చోటు చేసుకున్న పరిణామంలో మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకవేళ.. అల్లు అర్జున్ కారు నుంచి బయటకు రాకుండా ఉంటే.. ఈ తొక్కిసలాట జరిగేది కాదు. ఈ విషయాన్ని వదిలేసి.. లాజిక్కులతో ప్రశ్నించే ఆర్జీవీ లాంటోళ్లంతా.. తాము ఎటు వైపు ఉంటే.. అటు వైపు మాత్రమే న్యాయం.. మిగిలిన వైపులంతా అన్యాయంతో నిండి ఉందన్నట్లుగా మాట్లాడే తీరు.. అత్యధికుల్ని తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.