ఆర్జీవీని కలిసిన చెవిరెడ్డి... ఒంగోలులో పోలీసు విచారణ స్టార్ట్!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిశారు.
By: Tupaki Desk | 7 Feb 2025 8:01 AM GMTగత సార్వత్రిక ఎన్నికలకు ముందు "వ్యూహం" అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నేటి డిప్యూటీ సీఎం పవన్ తో పాటు నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు! దీనిపై ఏపీలో ఆర్జీవీపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి!
ఇందులో ప్రధనంగా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట రామ్ గోపాల్ వర్మ ఈ రోజు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవును... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా.. ప్రకాశం జిల్లా మద్దిపాడు పండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్ లో వీరిద్దరూ మంతనాలు జరిపారు. ఈ సమయంలో... ఒంగోలు పోలీసులు తనపై నమోదు చేసిన కేసు, మొదలైన విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక వీరి భేటీ అనంతరం రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సమయంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీకాంత్ బాబు.. ఆర్జీవీని విచారిస్తున్నారు. ఈ సమయంలో... విచారణ అనంతరం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
కాగా... ఈ కేసు విచారణలో భాగంగా... వర్మ ఏపీ పోలీసుల ముందు ఎప్పుడో హాజరుకావాల్సి ఉంది! ఆయనకు గతంలోనే నోటీసులు ఇచ్చినా.. తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెబుతూ వాట్సప్ ద్వారా సమాచారం అందించారు. ఇదే సమయంలో.. తనపై పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారని.. ఆ ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సమయంలో ఆర్జీవీకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు రూరల్ పోలీసులు ఇటీవల మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపించడంతో.. నేడు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు హాజరవ్వడానికి ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ అయ్యారు.