విచారణ వేళ పోలీసులకు ఆర్జీవీ వాట్సప్ మెసేజ్... ఏమి చెప్పారంటే..?
ఈ సమయంలో నేడు వర్మ పోలీసు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారనుకున్న సమయంలో... ట్విస్ట్ ఇచ్చారు!
By: Tupaki Desk | 19 Nov 2024 6:12 AM GMTసినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలంటూ ఇటీవల ఏపీ పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ హైకోర్టును ఆశ్రయించినా.. ఫలితం దక్కలేదనే చెప్పాలి! ఈ సమయంలో నేడు వర్మ పోలీసు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారనుకున్న సమయంలో... ట్విస్ట్ ఇచ్చారు!
అవును... ఏపీ పోలీసుల విచారణ తేదీ వచ్చిన వేళ.. ఆర్జీవీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సమయం కావాలని కోరారు! ఈ మేరకు విచారణకు సహకరిస్తాను కానీ.. నాలుగు రోజులు సమయం కావాలని, సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉందని కారణంగా విచారణకు రాలేనని ఒంగోలు పోలీసులకు వాట్సప్ లో మెసేజ్ పంపించారు!
ఇలా... విచారణకు రావాలంటూ సుమారు ఐదు రోజుల క్రితం నోటీసులు ఇస్తే సరిగ్గా ఈ రోజు.. మరో నాలుగు రోజులు కావాలంటూ వర్మ మెసేజ్ పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పందించిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు... వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా... ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై కొన్ని రోజుల క్రితం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు వర్మకు నోటీసులు అందించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఇందులో భాగంగా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే... ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యే విషయంలో మరింత సమయం కావాలనే అభ్యర్థనను పోలీసులకు చేయాలని సూచించింది! ఈ నేపథ్యంలో.. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలని ఆర్జీవీ పోలీసులకు వాట్సప్ మెసేజ్ పెట్టారు!