నో రెస్పాన్స్... ఆర్జీవీకి తత్వం బోధపడిందా..?
ప్రధానంగా వైసీపీ సర్కార్ హయాంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు, తీసిన సినిమాలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 11:24 AM ISTసినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తన సినిమాల సక్సెస్ తో జనాల్లో నానితే.. గత కొంతకాలంగా వివాదాస్పద కామెంట్లు, వివాదాస్పద పోస్టులు, వివాదాస్పద సినిమాలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్మ కేసులను ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా వైసీపీ సర్కార్ హయాంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు, తీసిన సినిమాలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాన్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా వర్మ వివాదాస్పద కామెంట్లు చేస్తూ, పోస్టులు పెట్టారనే ఆరోపణలకు సంబంధించిన విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఇప్పటికే వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయనే చర్చ నడుస్తోంది! ఈ సమయంలో తాజాగా తన కొత్త సినిమా "శారీ" ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీపై రాజకీయాలు, అరెస్టులకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే.. పాలిటిక్స్ విషయంలో ఆర్జీవీ నుంచి ఒక్క పూర్తి సమాధానం రాకపోవడం గమనార్హం!
అవును... తాజాగా ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ తన "శారీ" మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చినప్పటికీ.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడం అత్యంత సహజమనే చెప్పాలి! అదే విధంగా ఈ ఇంటర్వ్యూలోనూ తాజా రాజకీయ పరిణామాలపై పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు.
అయితే... గతంలో ఏ విషయంపై ప్రశ్నించినా తనదైన శైలిలో వివరణలు ఇస్తూ, తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెబుతారనే పేరు సంపాదించుకున్న వర్మ... ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించారు! తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని.. కేసులకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాను ఏమీ మాట్లాడనని అన్నారు.
ఇక.. పోసాని సైతం ఇటీవల ఇకపై రాజకీయాలకు దూరం, తాను ఇక వాటి గురించి మాట్లాడను అని చెప్పినప్పటికీ అరెస్ట్ చేయడం గురించి ప్రస్థావించగా.. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని.. తాను ఏమీ ఫాలో కావట్లేదని.. తాను రాజకీయాల గురించి మాట్లాడనని వర్మ స్పష్టంగా చెప్పేశారు!
ఇదే సమయంలో గతంలో చేసిన ట్వీట్లు, తీసిన సినిమాల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ.. తనకెందుకు ఈ గోల, చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా అన్న ప్రశ్నకు సమాధానంగా స్పందించిన ఆర్జీవీ... తనకు ఏ విషయంలోనూ, ఎలాంటి రిగ్రీట్స్ లేవని చెప్పడం గమనార్హం. అన్నింటినీ తాను అనుభవాలుగానే తీసుకుంటానని అన్నారు.
దీంతో... ఇకపై వర్మ నుంచి పాలిటిక్స్ విషయంలో పెద్దగా కామెంట్లు ఎక్స్ పెక్ట్ చేయలేమని ఒకరంటే... ఆర్జీవీకి తత్వం బోధపడినట్లుందని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా... ఆర్జీవీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందనేది మరొకరి స్పందన!