ఇదేం బలుపు? స్కూల్ ఫేర్ వెల్ కు 35 లగ్జరీ కార్లతో రచ్చ ర్యాలీ
సంపన్నులకు నిలయమైన సూరత్ లో ఒక స్కూల్ ఉంది. ఓల్పాడ్ ప్రాంతానికి చెందిన ఈ ఖరీదైన స్కూల్ కు ఇటీవల ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు.
By: Tupaki Desk | 14 Feb 2025 4:24 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఎంత సంపన్నులు అయితే మాత్రం మరీ ఇంత బలుపా? అన్న భావన కలుగక మానదు. ప్లస్ టూ చదువుతున్న మైనర్ కుర్రాళ్లు స్కూల్ ఫేర్ వెల్ పార్టీ వేళ.. సూరత్ రోడ్లపై రచ్చ రచ్చ చేవారు. వార్షిక పరీక్షల సందర్భంగా నిర్వహించే ఫేర్ వెల్ పార్టీని రోటీన్ కు భిన్నంగా నిర్వహించాలని భావించిన 35 మంది విద్యార్థులు వినూత్న ర్యాలీకి తెర తీశారు. తమ తల్లిదండ్రుల్ని కేసుల్లో ఇరికించారు. అసలేం జరిగిందంటే..
సంపన్నులకు నిలయమైన సూరత్ లో ఒక స్కూల్ ఉంది. ఓల్పాడ్ ప్రాంతానికి చెందిన ఈ ఖరీదైన స్కూల్ కు ఇటీవల ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. స్కూల్లో ప్లస్ టూ చదివే విద్యార్థులు ఈ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని భావించారు. ఇందుకోసం ఒక మాట అనుకొని.. తమ ఇళ్లల్లో ఉండే లగ్జరీ కార్లు (ఒక్కటి కూడా సాదాసీదా కారు లేదు) బెంజ్.. ఫోర్షే.. బీఎండబ్ల్యూ లాంటి 35 ఖరీదైన కార్లను వేసుకొని.. సూరత్ రోడ్లపై ఒక ర్యాలీ మాదిరి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు చేసిన హడావుడి.. విన్యాసాలు అన్నిఇన్ని కావు. కొందరు విద్యార్థులు డోర్ల మీద కూర్చుంటే.. మరికొందరు సన్ రూఫ్ మీద స్మోక్ గన్ లను పట్టుకొన్నారు. దారి పొడువుగా కేకలు.. అరుపులు.. కేరింతలతో రచ్చ రచ్చ చేశారు. వీరి తీరుపై సూరత్ నగర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
విచారణ జరిపిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 35 లగ్జరీ కార్లలో 26 కార్లను గుర్తించి..22 కార్లను సీజ్ చేశారు. మిగిలిన కార్ల కోసం వెతుకుతున్నారు. కార్లు నడిపిన మైనర్ కుర్రాళ్ల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. మొత్తంగా డబ్బున్న అహంకారం.. తాము ఏమైనా చేయగలమన్న తీరు ఆందోళనకు గురి చేసేదిలా ఉందని చెప్పాలి. ఈ తరహా బలుపు చర్యలపై కఠిన చర్యలు తీసుకోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఆ దిశగా ఆలోచించటానికి సైతం భయపడేలా చర్యలు ఉండాలన్న మాట వినిపిస్తోంది.