ఈ అభ్యర్థి ఆస్తుల విలువ కేవలం రూ.320... టాప్ 5 రిచ్చెస్ట్ ఎవరంటే..
ఈ రోజు లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్... పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోంది
By: Tupaki Desk | 19 April 2024 4:52 AM GMTఈ రోజు లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్... పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోంది. ఈ తొలిదశ పోలింగ్ లో సుమారు 16.6 కోట్ల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనుండగా.. ఈ దశలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1625! ఈ క్రమంలో వీరిలో అత్యంత సంపన్నులు, అతి పేద అభ్యర్థుల జాబితా ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థుల ఆస్తుల విలువ కేవలం వందల్లో ఉండటం గమనార్హం.
అవును... నేడు లోక్ సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సమయంలో పోటీ చేస్తున్న 1625మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఆస్తుల విలువ రూ.716 కోట్లుగా ఉండగా.. కనిష్ఠంగా ఒక అభ్యర్థి తన వద్ద 320 రూపాయలు మాత్రమే ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో భాగంగా... తొలి దశలో పోటీ పడుతున్న 1,625 మంది అభ్యర్థుల ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. వీరిలో 10 మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించగా.. పోటీ చేస్తున్నవారిలో 450 మంది మంది కోటీశ్వరులుగా ఉన్నారని.. వీరంతా కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగివున్నారని తెలిపింది. వీరి జాబితానూ ఏడీఆర్ వెలుగులోకి తెచ్చింది!
ఇందులో... మధ్యప్రదేశ్ లోని చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఆస్తి విలువ రూ.716 కోట్లుగా ఉండగా... మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడే నకుల్ నాథ్ ఆస్తుల విలువ రూ.662 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో... తమిళనాడులోని శివగంగ స్థనం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
ఇదే క్రమంలో... ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గర్వాల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి షా రూ.206 కోట్లతో, ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మాజిద్ అలీ రూ.159 కోట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు.
ఇదే సమయంలో... 10 మంది అభ్యర్థులు తమ ఆస్తుల విలువ సున్నా అని ప్రకటించగా... తమిళనాడులోని తూత్తుకుడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్ రాజ్ తన ఆస్తి విలువ కేవలం రూ.320 అని వెల్లడించారు. ఈ జాబితాలో... మహారాష్ట్రలోని రామ్ టెక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న కార్తీక్ గెండ్లాజీ డోక్, తమిళనాడులోని చెన్నై నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సూర్యముత్తు తమ వద్ద ఉన్న ఆస్తి విలువ రూ.500 అని ప్రకటించారు.
అనంతరం తమిళనాడులోని అరణి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామోధరన్ తన వద్ద్ద ఉన్న ఆస్తుల విలువ రూ.1,000కే సరిపోతాయని చెప్పగా... తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గంలో బరిలోకి నిలిచిన సెబాస్టియన్.. రూ.1,500 ఆస్తులను ప్రకటించారు.