Begin typing your search above and press return to search.

ధనవంతుడి 19 ఏళ్ల కుమార్తె.. సన్యాసినిగా మారడం వెనుక!

రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ లో ధనవంతులైన ఒక మార్వాడీ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి సంచలన నిర్ణయం తీసుకుంది

By:  Tupaki Desk   |   14 Jan 2024 4:41 AM GMT
ధనవంతుడి 19 ఏళ్ల కుమార్తె.. సన్యాసినిగా మారడం వెనుక!
X

రాజ్యాన్ని వదిలేసి సన్యాసిగా మారిన బుద్ధుడి గురించే మనకు తెలుసు.. ఇప్పుడు అదే కోవలో సిరి సంపదలను, ఐహిక సుఖాలను, లెక్కకు మిక్కిలి సౌకర్యాలను విడిచిపెట్టి ఒక 19 ఏళ్ల యువతి సన్యాసినిగా మారిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ లో ధనవంతులైన ఒక మార్వాడీ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని సుఖభోగాలను త్యజించి జైన సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుంది. 19 ఏళ్ల వయసు అంటే ఆడిపాడే.. తుళ్లింతలతో, స్నేహితులతో, ఎంజాయ్‌ మెంట్‌ తో గడిపే వయసు. ఆ యువతికి కావాల్సినంత సంపద ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ త్యజించి తెల్లని వస్త్రాలు ధరించి సన్యాసిని జీవితాన్ని గడపనుంది.

వివరాల్లోకెళ్తే రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ లో ఒక మార్వాడీ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యోగితా సురానా అనే యువతి అన్ని భౌతిక సుఖాలను త్యజించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తన జీవితాంతం ఫ్యాన్, లైట్, టూత్‌ బ్రష్, సబ్బు, షాంపూలను వినియోగించనని కఠోర నియమం పెట్టుకుంది. మోక్షాన్ని సాధించడం కోసమే సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది.

వచ్చే వారం హైదరాబాద్‌ లో జైన సమాజ్‌ లో జరగనున్న వేడుకలో ఆమె సన్యాసిగా మారనుంది. సన్యాసిని కావడానికి దీక్ష తీసుకునే ముందు తాను ప్రాపంచిక కోరికలు లేని వ్యక్తిగా ఉండాలని యోగితా వెల్లడించింది.

తాను చిన్నతనంలో పైలట్, సీఏ, ఐఏఎస్‌ ల్లో ఏదో ఒకటి కావాలనుకునేదాన్నని యోగిత తెలిపింది. అయితే తాను పెరుగుతున్న కొద్దీ అవి మారుతూనే ఉన్నాయని వెల్లడించింది. కోరికలకు అంతం లేదని.. అందుకే తాను కోరికలు, ప్రాపంచిక సుఖాలను విడనాడాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. వీటి నుంచి బయటపడి మోక్షం సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. అందుకే తాను సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నానని వివరించింది.

యోగిత నిర్ణయం మొదట్లో ఆమె తల్లిదండ్రులకు షాక్‌ ఇచ్చింది. తర్వాత వారు ఆమె నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ మద్దతు ప్రకటించారు. దీంతో యోగిత తన తల్లిదండ్రులు పద్మరాజ్‌ సురానా, సపానా సురానా, అక్క, బావ, చెల్లెలు ప్రాచీతో కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించారు.

కాగా జైన సన్యాసినిగా మారే ప్రక్రియ చాలా సుదీర్ఘమైంది. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలతో ఒక మతపరమైన ఊరేగింపు జరుగుతుంది, దీనిలో అమ్మాయి సన్యాసిని జీవితానికి మారడానికి ముందు చివరిసారిగా తన అత్యుత్తమ దుస్తులను ధరించాల్సి ఉంటుంది.