Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ ను వదులుకోనంటున్న జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి తాను అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 May 2024 9:14 AM GMT
ఆర్‌ఆర్‌ ను వదులుకోనంటున్న జగన్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి తాను అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఆయన విజయవాడలోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లారు. వైసీపీకి 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు వస్తాయని జగన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐప్యాక్‌ టీమ్‌ ను నడిపిస్తున్న రిషి రాజ్‌ సింగ్‌ పై జగన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఐప్యాక్‌ తో తమ బంధం ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి 2019 ఎన్నికల నుంచి ఐప్యాక్‌ తో జగన్‌ అనుబంధం కొనసాగుతోంది. నాడు ఐప్యాక్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ)ను ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) నడిపించారు. ఆయన వ్యూహాలతో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కూడా ఐప్యాక్‌ తో జగన్‌ తన బంధాన్ని కొనసాగించారు. అయితే దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఏపీ రాజకీయాలకు దూరమయ్యారు.

పీకే దేశ రాజకీయ పరిస్థితులపై దృష్టి సారించడంతో ఐప్యాక్‌ ను రిషి రాజ్‌ సింగ్‌ నడిపించారు. అప్పటి నుంచి జగన్‌ ను మరోసారి అధికారంలోకి తేవడానికి తన వ్యూహాలను అమలు చేశారు.

తన వ్యూహాల ద్వారా రిషి రాజ్‌ సింగ్‌.. జగన్‌ మనసు చూరగొన్నారని తెలుస్తోంది. ‘సిద్ధం’, ‘మేమంతా సిద్ధం’ ఇవన్నీ రిషి రాజ్‌ ఆలోచనలేనని చెబుతున్నారు. అలాగే ‘గడప గడపకు మన ప్రభుత్వం’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలు, ‘జగనన్నకు చెబుదాం’, ‘మా నమ్మకం నువ్వే జగన్‌’.. ఇలాంటివి వైసీపీకి మైలేజ్‌ తేవడం వెనుక రిషి రాజ్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ ఉందని అంటున్నారు.

సహజంగానే రిషి రాజ్‌ సింగ్‌ పనితీరుకు జగన్‌ ఫిదా అయ్యారని.. ఈ నేపథ్యంలోనే ఇక ముందు కూడా ఐప్యాక్‌ తో అనుబంధం కొనసాగించడానికి సిద్ధపడ్డారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, రాబోయే సంవత్సరాల్లో రిషి రాజ్‌ సింగ్, అతని బృందంతో కలిసి పనిచేయాలని జగన్‌ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఐప్యాక్‌ కార్యాలయానికి జగన్‌ వెళ్లారని అంటున్నారు.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినా రిషిని నిందించడని అంటున్నారు. అంతగా జగన్‌ కు ఆయనపైన, ఆ టీమ్‌ పైన నమ్మకం ఉందని పేర్కొంటున్నారు.

మరోవైపు రిషి కూడా జగన్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్‌ లో పనిచేయడానికి ఐ–ప్యాక్‌ లేదా మరే ఇతర ఏజెన్సీ కారణం కాదన్నారు. తనపై, తన టీమ్‌ పై జగన్‌ కు ఉన్న నమ్మకమే కారణమన్నారు. పీకే ఐప్యాక్‌ ను వదిలిపోయినా జగన్‌ కు ఎలాంటి ఆందోళన లేదన్నారు.

తమ వ్యూహాల వల్ల జగన్‌ గెలవడం లేదని.. జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనే కారణమన్నారు. ఈ ఎన్నికల్లోనూ జగన్‌ ఘనవిజయం సాధించడం ఖాయమని తెలిపారు. మరోసారి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.