ఢిల్లీలో బ్రిటన్ ప్రధాని... ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు!
సందర్భంగా... ఈ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని చెప్పిన ఆయన... ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని.. ఈదేశం అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు.
By: Tupaki Desk | 8 Sep 2023 11:47 AM GMTఢిల్లీలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జీ20 సదస్సుపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ సదస్సుకు ఈసారి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఈ క్రమంలో 19దేశాలకూ చెందిన ప్రతినిధులు, అధికారులు హస్తినలో ల్యాండ్ అవుతున్నారు. ఈ క్రమంలో భారత్ అల్లుడిగా పిలుచుకునే బ్రిటన్ ప్రధాని వచ్చారు!
అవును... ఢిల్లీలో జరగనున్న జి-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ కు చేరుకున్నారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, ఇండియాలోని బ్రిటన్ హైకమిషనర్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని దంపతుల గౌరవార్థం ఎయిర్ పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను సునాక్ దంపతులు తిలకించారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శనను ప్రశంసించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియాకు తాను అల్లుడినని చెప్పిన రిషి సునక్... ఈ విషయం ఎక్కడో రాస్తే అది తాను చూశానని వివరించారు. ఈ సందర్భంగా... ఈ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని చెప్పిన ఆయన... ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని.. ఈదేశం అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను ఈ సదస్సులో పాల్గొంటున్నట్లు తెలిపిన బ్రిటన్ ప్రధాని... ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు గుప్పించారు. జీ20 సదస్సులో పాల్గొనకుండా పుతిన్ మరోసారి ముఖం చాటేశారని.. ఫలితంగా దౌత్య బహిష్కరణ రూపశిల్పిగా తనకు తానే మలుచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అర్జెంటినా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్, ఇటలీ ప్రైం మినిస్టర్ జార్జియా మెలోనీ, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్ పర్సన్ అజాలీ అసౌమని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మొదలైన వారు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
కాగా... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని, రిషి సునక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్షత మూర్తితో కలిసి రిషి సునక్ భారత్ వచ్చారు. ఈ సందర్భంగా తాను ఇండియా అల్లుడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.