Begin typing your search above and press return to search.

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ కు ఎదురుదెబ్బ.. పవర్ లేబర్ పార్టీ చేతుల్లోకి!

గురువారం రాత్రి ముగిసిన సార్వత్రిక ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని తేలిపోతోంది.

By:  Tupaki Desk   |   5 July 2024 4:57 AM GMT
బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ కు ఎదురుదెబ్బ.. పవర్ లేబర్ పార్టీ చేతుల్లోకి!
X

అనుకున్నదే జరుగుతోంది. గడిచిన ఆర్నెల్లుగా బ్రిటన్ లో అధికార బదిలీ ఖాయమన్న సంకేతాలు తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గురువారం రాత్రి ముగిసిన సార్వత్రిక ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని తేలిపోతోంది. గడిచిన పద్నాలుగేళ్లుగా నాన్ స్టాప్ గా పాలించిన కన్జర్వేటివ్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓడటం ఖాయమని.. అదే సమయంలో ఏళ్లకు ఏళ్లుగా అధికారం కోసం తపిస్తున్న లేబర్ పార్టీ చేతికి పగ్గాలు రావటం పక్కా అని తేలింది.

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే విషయాన్ని అంచనా వేశాయి. లేబర్ పార్టీ 410 స్థానాల్ని గెలుస్తుందని.. కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకు పరిమితమవుతుందని అంచనా వేశాయి. యూకేలో అధికారం చేపట్టటానికి 326సీట్లు అవసరమవుతాయి. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలుగా అభివర్ణిస్తున్న ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫు కీర్ స్టార్మర్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. మారిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలకు.. ఓటర్లకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో స్టార్మల్ పేర్కొన్నారు.

ఇంగ్లండ్.. స్కాట్లాండ్.. వేల్స్.. నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారం చేతికి అందాలంటే 326 స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ప్రధాన (కన్జర్వేటివ్, లేబర్) పార్టీలతోపాటు లిబరల్ డెమోక్రాట్లు.. గ్రీన్ పార్టీ.. స్కాటిష్ నేషనల్ పార్టీ.. ఎస్ డీఎల్ పీ.. డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ.. షిన్ ఫీన్.. ప్లయిడ్ కమ్రి.. వర్కర్స్ పార్టీ.. యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్రాత్రి 10 గంటల వరకు సాగింది. 2019తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి అంతకన్నా తక్కువ పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు సాగుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటల వేళలో లేబర్ పార్టీ 151 సీట్లను సొంతం చేసుకుంది.

భారీ ఎత్తున ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యతలో ఉన్నారు. ఇదే సమయానికి రిషి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ కేవలం 23 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఈ ఫలితాల్ని చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నట్లుగా లేబర్ పార్టీకి 400ప్లస్ సీట్లు ఖాయమని.. కన్జర్వేటివ్ పార్టీ అంచనాల కంటే తక్కువ సీట్లకు పరిమితమయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు వెలువడుతున్న ఫలితాల ప్రకారం చూస్తే.. అధికారానికి అవసరమైన 326 స్థానాల్ని లేబర్ పార్టీ సులువుగా సాధిస్తుందని చెప్పక తప్పదు.