Begin typing your search above and press return to search.

వలసదారుల తరలింపు.. ఖర్చు ‘విమానం’ మోత.. ట్రంప్ నకు తలబొప్పి!

యుద్ధ విమానం అంటే ఖర్చు మామూలుగా ఉండదు.. దాని నిర్మాణం, ఇంధన ఖర్చు అంతా చాలా ఎక్కువ.

By:  Tupaki Desk   |   6 March 2025 9:00 PM IST
వలసదారుల తరలింపు.. ఖర్చు ‘విమానం’ మోత.. ట్రంప్ నకు తలబొప్పి!
X

ఇదిగో.. నేను అమెరికా అధ్యక్షుడు అయితే వలసదారులను తరిమేస్తా.. అంటూ ఉరిమిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు.. వస్తూ వస్తూనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. భారత్ సహా అనేక దేశాలకు చెంది.. తమ దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని విమానాల్లో తరలించేశారు. అది కూడా సంకెళ్లు వేసి మరీ పంపించేశారు.. అంతా బాగానే ఉంది.. అధికారంలోకి వచ్చిన ఊపులో ఏమీ కనిపించలేదు కానీ.. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే మాత్రం అమెరికాకు తలబొప్పి కడుతోంది.

యుద్ధం విమానం.. పైగా ఒకటే బాత్ రూం.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఇదీ ఇప్పటివరకు వివిధ దేశాలకు అక్రమ వలసదారులను పంపించిన విధానం. అయితే, ఈ పద్ధతిలో అమెరికాకు రవాణా ఖర్చు తడిసి మోపెడు అవుతోందట.. కారణం సైనిక విమానాలు కావడమే.. ఈ భారీ ఖర్చులను గమనించిన అధికారులు మున్ముందు యుద్ధ విమానాలు కాకుండా సాధారణ విమానాల్లో తరలించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

యుద్ధ విమానం అంటే ఖర్చు మామూలుగా ఉండదు.. దాని నిర్మాణం, ఇంధన ఖర్చు అంతా చాలా ఎక్కువ. దీంతో వారి తరలింపు కోసం ప్రస్తుతం ఎలాంటి విమానాలు షెడ్యూల్ చేయలేదట. ఈ నెల ఒకటికే ఒక విమానం షెడ్యూల్ అయిందని వెల్లడించారు. దీంతో తరలింపునకు ఇచ్చిన విరామం పొడిగించవచ్చని లేక పూర్తిగా ఆపేయొచ్చని సమాచారం.

అమెరికా నుంచి ఇటీవల గ్వాటెమాలా, పెరూ, హోండూరస్‌ తదితర దేశాలకు వందలాది అక్రమ వలసదారులను తరలించిన సంగతి తెలిసిందే. గ్వాటెమాలాకు ఒక్కో వ్యక్తికి 4,675 డాలర్లు ఖర్చయిందట. మామూలు టికెట్‌ 853 డాలర్లు అయితే అంతకు ఐదు రెట్లు ఎక్కువైందట. ఇక చార్టర్డ్‌ విమానాల కన్నా సైనిక విమానాలే ఖరీదు ఎక్కువ. ఈ విమానాలపై గంటకు 17 వేల డాలర్లు చొప్పున ఒక్కొక్కరిపై 630 డాలర్ల వ్యయం అవుతోంది. సీ-17 అయితే గంటకు 28,500 డాలర్లు.

అమెరికాకు అతి దగ్గరగా ఉండే దేశం గ్వాటెమాల. దానికే ఇంత ఖర్చు అయితే.. భారత్‌ వరకు పంపాల్సి వస్తే వ్యయం ఊహించలేనిది. ఫ్లై జోన్ నిబంధనలు, మిలిటరీ బేస్‌ లలో ఇంధనం నింపుకోవడం రీత్యా వాణిజ్య విమానాల మాదిరిగా కాక సైనిక విమానాల రూట్ వేరు.

భారత వలసదారుల విమానం ప్రయాణం 43 గంటలు పట్టింది. ఇదే విమానం రిటర్న్ జర్నీనీ కలుపుకొంటే.. వలసదారుల తరలింపునకు మిలియన్‌ డాలర్ల పైనే ఖర్చు అయిందని సమాచారం. ఒక్కొక్కరిపై రూ.8.74 లక్షలు (10 వేల డాలర్లు) ఖర్చుపెట్టి మరీ ఇంటికి పంపినట్లయింది. అందుకే ఈ వ్యయాన్ని చూసి అమెరికా అధికారులు కళ్లు తేలేస్తున్నారు.