"నా చావుకు భార్య, ఆమె బంధువు కారణం"... మరో షాకింగ్ ఘటన!
ఈ సమయంలో.. తాజాగా మరో దారుణం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 7 March 2025 10:00 PM ISTగత కొంతకాలంగా భార్య, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెడుతున్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని లేఖలు రాస్తూ, వీడియోలు విడుదల చేస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సమయంలో.. తాజాగా మరో దారుణం తెరపైకి వచ్చింది.
అవును... తన చావుకు భార్యే కారణమంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ హోటల్ గదిలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్న అతడు.. ఆ సూసైడ్ నోట్ ను కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో.. హోటల్ డోర్ బయట డు నాట్ డిస్టర్బ్ అనే బోర్డు తగిలించి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాళ్లోకి వెళ్తే... ముంబైలోని ఓ హోటల్ లో దిగాడు నిశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి. అనంతరం హోటల్ లో తన గది బయట "డు నాట్ డిస్టర్బ్" అని బోర్డు తగిలించి ఉంచారు. దీంతో.. హోటల్ సిబ్బంది ఎవరు అతడిని డిస్టర్బ్ చేయలేదు. అయితే... ఎంతకీ అతడు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తమ వద్ద ఉన్న ‘కీ’తో గది తలుపులు తెరిచారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే నిశాంత్ మరణించారు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ లో తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూనే... తన చావుకు భార్యతో పాటు ఆమె బంధువు కారణమని పేర్కొన్నారు. ఆ లేఖను కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
"ఈ లేఖ నువ్వు చదివే సమయానికి నేనుండను.. వాస్తవానికి మన మధ్య జరిగిన వాటిని నిన్ను నేను ద్వేషించాలి కానీ.. నేను నిన్ను అప్పుడు, ఇప్పుడూ ప్రేమిస్తున్నాను. మీ ఇద్దరి వల్ల నేను పడిన వేదనంతా తా తల్లికి తెలుసు. మీరు ఎవరూ ఆమెను కలవొద్దు.. ఇది నా కోరిక.. నా తల్లిని అయిన ప్రశాంతంగా బాధ పడనివ్వండి" అని లేఖలో వాపోయారు!
ఈ సందర్భంగా... మహిళా హక్కుల కార్యకర్త అయిన నిశాంత్ తల్లి... విషయం తెలుసుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె... కుమారుడి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తానొక జీవచ్ఛవ్వాన్నని.. తన బిడ్డ తనను వదిలిపెట్టి వెళ్లిపోయాడని అన్నారు!
కాగా... కొన్ని నెల్ల క్రితం బెంగళూరులో అతుల్ సుభాశ్ అనే వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుమారు 40 పేజీల లేఖ రాసి.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు కూడా ఆ లేఖ పంపించి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక.. ఇటీవల ముంబైలోని ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన మరణానికి భార్య కారణమని పేర్కొంటూ, ఓ సెల్ఫీ వీడియో తీసుకుని, ఈ సందర్భంగా తన తల్లితండ్రులకు క్షమాపణలు చెబుతూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో... ఈ వరుస ఘటనలపై కోర్టులు స్పందించాలని పలువురు కోరుకుంటున్నారు!