Begin typing your search above and press return to search.

బెంగాలీ ఇండస్ట్రీ రోత బతుకు గురించి ఆ ఫేమస్ నటి ఓపెన్

ఇప్పటికే మలయాళ పరిశ్రమ గురించి ఓపెన్ అయిన అక్కడి నటీమణుల దెబ్బకు పలు సంచలనాలు చోటుచేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2024 4:26 AM GMT
బెంగాలీ ఇండస్ట్రీ రోత బతుకు గురించి ఆ ఫేమస్ నటి ఓపెన్
X

కేరళ సర్కారు పుణ్యమా అని మలయాళ పరిశ్రమ లోటుపాట్లను వెల్లడించింది హేమ కమిటీ. ఈ నేపథ్యంలో బెంగాలీ చిత్ర పరిశ్రమపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఆ ఇండస్ట్రీకి చెందిన ఫేమస్ బెంగాలీ నటి రితాభరి చక్రవర్తి. ఇప్పటికే మలయాళ పరిశ్రమ గురించి ఓపెన్ అయిన అక్కడి నటీమణుల దెబ్బకు పలు సంచలనాలు చోటుచేసుకున్నాయి. హేమ రిపోర్టు కారణంగా ఇంతకాలం మౌనంగా.. తమలో తాము వేదన చెందే నటీమణులు తాజాగా గొంతు విప్పుతున్నారు.

కేరళలో మాదిరి బెంగాలీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని బెంగాలీ పాపులర్ హీరోయిన్ రితాభరి చక్రవర్తి డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు కొత్త కలకలానికి గురయ్యేలా చేసింది. ఇప్పటికే వైద్య విద్యార్థిని హత్యాచార ఎపిసోడ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మమత సర్కారుకు తాజా డిమాండ్ ఇబ్బందికి గురయ్యేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

బెంగాలీ చిత్ర పరిశ్రమలోని పలువురు నటీమణులు వేధింపులకు గురవుతున్నట్లుగా రితాభరి చెప్పుకొచ్చారు. నటులు.. దర్శక నిర్మాతల నుంచి ఎదురవుతున్న వేధింపుల మీద బెంగాలీ చిత్ర పరిశ్రమపైన కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడితో ఆగని ఆమె మరో సంచలన ఆరోపణ చేశారు. సినిమా ఇండస్ట్రీలో వేధింపులకు పాల్పడే పలువురు నిందితులు.. కోల్ కతాలోని ఆర్ జీకర్ ఆసుపత్రి వైద్య విద్యార్థిని హత్యాచార వ్యతిరేక నిరసనల్లో నిస్సిగ్గుగా పాల్గొంటున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రితాభరి కోరినట్లుగా దీదీ సర్కార్ రియాక్టు అవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

రితాభరి మమతా కెరీర్ విషయానికి వస్తే.. 2014లో విడుదలైన ఛోతుష్ కోన్ తో పాటు అదే ఏడాది విడుదలై భారీ సక్సెస్ సాధించిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కోల్ కతా మూవీలు ఉన్నాయి. అంతేకాదు.. 2015లో బవాల్, 2022లో విడుదలైన ఫటాఫతి మూవీలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత బెంగాలీ సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న అంశం తనను ఆలోచించేలా చేసిందన్నారు.

హేమ కమిటీలో ఇచ్చిన నివేదికలోని చాలా అంశాలు తనకు ఎదురైన అనుభవాల మాదిరే ఉన్నట్లుగా తెలిపారు. "ఈ మగాళ్లలో చాలా మంది ఇండస్ట్రీని ప్రభావితం చేసే వాళ్లే ఉన్నారు. వారి గురించి మాట్లాడితే అవకాశాలు కోల్పోతామని అనుకోవద్దు. ఇంకెంత కాలం మౌనంగా ఉందాం? ఎన్నో కలలతో యువ నటీమణులు ఇక్కడకు వస్తున్నారు. కానీ.. ఇది ఘుగర్ కోటెడ్ వ్యభిచార గృహం తప్ప మరొకటి కాదని నమ్ముతున్నా" అంటూ ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తనకు తెలిసిన పలువురు కీచక నటులు, నిర్మాతలు, దర్శకులు ఆర్ జి కర్ బాధితురాలి కోసం కొవ్వొత్తులను పట్టుకుని నిస్సిగ్గుగా ర్యాలీలో పాల్గొన్నరని.. ఇలాంటి మానవ మృగాల ముసుగులు విప్పాల్సిన సమయం వచ్చిందన్న ఆమె మాటలు తాజా సంచలనంగా మారాయి. "ఈ రాక్షసులకు వ్యతిరేకంగా గళం విప్పాలని తోటి నటులకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హేమ కమిటీ లాంటి సంస్థను ఏర్పాటు చేయాలి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి" అన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.