పాలు పుస్తకాల సేల్స్‌మేన్ రోజుకు 32కోట్లు సంపాదన!
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన సేల్స్‌మ్యాన్ ఎవరో తెలుసా? అతడు ఒకప్పుడు రోడ్ పై పాలు, పుస్తకాలు అమ్మేవాడు.
By: Tupaki Desk | 31 Jan 2025 4:07 AM GMTభారతదేశంలోని అత్యంత ధనవంతులైన సేల్స్‌మ్యాన్ ఎవరో తెలుసా? అతడు ఒకప్పుడు రోడ్ పై పాలు, పుస్తకాలు అమ్మేవాడు. ఇప్పుడు రోజుకు రూ. 32 కోట్లు సంపాదిస్తున్నాడు. అతడు పేదరికం నుంచి వచ్చి, వ్యాపార రంగంలో విజయకేతనం ఎగురవేసాడు. గల్ఫ్ సహా ప్రపంచవ్యాప్తంగా అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. అతడి పేరు రిజ్వాన్ సాజన్. ప్రఖ్యాత `డాను బే` గ్రూప్ వ్యవస్థాపకుడు.
ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రిజ్వాన్ కుటుంబం ప్రారంభంలో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తనను తాను పోషించుకోవడానికి ఇంటిని నడపడానికి అతడు చిన్న చిన్న ఉద్యోగాలను చేసాడు. వీధుల్లో పుస్తకాలు, పాలు అమ్మేవాడు. కానీ అనూహ్యంగా తన తండ్రిని కోల్పోయినప్పుడు జీవితం కొత్త మలుపు తిరిగింది. విదేశాలలో మెరుగైన అవకాశాల కోసం ఆలోచించడానికి అది కారణమైంది. 1981లో అతడు కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ట్రైనీ సేల్స్‌మ్యాన్‌గా పనిచేసాడు. ఈ ఉద్యోగం సేల్స్ రంగంలో చాలా నైపుణ్యాన్ని ఇచ్చింది. నెమ్మదిగా తాను వ్యవస్థాపకుడిగా, వ్యాపారవేత్తగా ఎలా ఎదగాలో అర్థం చేసుకున్నాడు.
1993లో తన కెరీర్లో ఒక నిర్ణయం అతడి జీవితాన్ని మార్చింది. అతడు ధైర్యంగా అడుగు వేసి డానుబే గ్రూప్‌ను స్థాపించాడు. మొదట్లో నిర్మాణ సామగ్రి వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ధృఢ సంకల్పం, అంకితభావం, వ్యూహాలతో అతడి కంపెనీ అసాధారణంగా ఎదిగింది. గృహాలంకరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధిలోకి అది విస్తరించింది. నేడు డానుబే గ్రూప్ సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, భారతదేశం సహా అనేక దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయా రంగాల్లో పాపులర్ కంపెనీగా డాను బే గ్రూప్ ఎదిగింది.
2019 నాటికి డానుబే గ్రూప్ 1.3 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్ సాధించినట్టు పేర్కొంది. తన ఉత్పత్తిలో నాణ్యతతో అతడు ఇంతగా ఫేమస్ అయ్యాడు. అతడు తనను తాను ఉత్తమ సేల్స్‌మ్యాన్ అని గర్వంగా ప్రకటించుకున్నాడు. ఆ వీడియో చాలా ఫేమస్ అయింది. డానుబే గ్రూప్ యుఏఈ ని దాటి విస్తరించడంలో.. గల్ఫ్, భారతదేశంలో అసాధారణంగా ఎదగడంలో అతడి అపారమైన కృషి దాగి ఉంది. నేడు డాను బే కంపెనీ ప్రతిరోజూ రూ.32 కోట్లు సులువుగా ఆర్జిస్తోంది. అతడి మొత్తం ఆస్తుల విలువ 2.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ. 20,830 కోట్లు. ముంబైలోని స్ట్రీట్ సేల్స్ మేన్ నుంచి .. దుబాయ్‌లోని బిలియనీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా మారిన రిజ్వాన్ సాజన్ ప్రయాణం నేటి జనరేషన్‌కి స్ఫూర్తిదాయకమైనది.