Begin typing your search above and press return to search.

ఆర్కేను పార్టీలో చేర్చుకుంది అందుకేనా?

వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ తిరిగి వైసీపీ గూటికి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:30 AM GMT
ఆర్కేను పార్టీలో చేర్చుకుంది అందుకేనా?
X

ఇటీవల వైసీపీకి రాజీనామా ప్రకటించి వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ తిరిగి వైసీపీ గూటికి వచ్చిన సంగతి తెలిసిందే.

2014లో 12 ఓట్ల తేడాతో, 2019లో 5,300 ఓట్ల తేడాతో మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ హామీ ఇచ్చి వైసీపీలో చేర్చుకున్నారనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కేటాయించారు. ఈ కారణం వల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలో చేరిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా గెలిపిస్తానని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2019లో ఓసీ అభ్యర్థి చేతిలో ఓడిన నారా లోకేశ్‌ 2024లో బీసీ అభ్యర్థి చేతిలో ఓడటం ఖాయమన్నారు. మరో 30 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా జగనే ఉంటారని తెలిపారు.

వైసీపీని వదిలిన రెండు నెలలు తాను చాలా బాధపడ్డానన్నారు. తన సమస్యలను జగన్‌ పరిష్కరించారని తెలిపారు. మొదట్లో జగన్‌ ను కలిసినప్పుడు తనను తమ్ముడిలా చూశారని.. ఇప్పుడు కూడా తమ్ముడులానే చూశారని కొనియాడారు. మంగళగిరి ప్రజలు తనను స్థానికుడిని కాకపోయినా గెలిపించారన్నారు.

కాగా గుంటూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వైసీపీలో చేర్చుకున్నారని అంటున్నారు. మంగళగిరి కూడా గుంటూరు పార్లమెంటరీ పరిధిలోకే వస్తుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంతోపాటు గుంటూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని సమన్వయం చేసే బాధ్యతలను ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో పదేళ్లుగా ఆర్కేనే ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వైసీపీ కేడర్‌ అంతా ఆయనతోనే ఉందని అంటున్నారు. మరోవైపు టీడీపీ తరఫున నారా లోకేశ్‌ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ ను ఓడించాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి బలమైన వ్యక్తి మద్దతు వైసీపీకి ఉందని అంటున్నారు. అందువల్లే స్వయంగా జగన్‌ సంప్రదించబట్టే ఆళ్ల తిరిగి వైసీపీలో చేరారని టాక్‌ వినిపిస్తోంది.