Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... తెలంగాణ కాంగ్రెస్‌ కు వైసీపీ ఎంపీ మద్దతు!

ఇందులో భాగంగా... వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలంగాణలో కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   26 May 2024 5:39 AM GMT
హాట్  టాపిక్... తెలంగాణ కాంగ్రెస్‌  కు వైసీపీ ఎంపీ మద్దతు!
X

రాజకీయాల్లో అప్పుడప్పుడూ ప్రజలకు కనిపించే విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, వరంగల్‌, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలంగాణలో కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించారు.

అవును... ఇటీవల జరిగిన ఏపీలోని సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ వార్ ఏ స్థాయిలో జరిగిందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా జగన్ లక్ష్యంగా షర్మిళ & కో తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అయితే ఊహించని రీతిలో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు వైసీపీ నుంచి మద్దతు లభించింది. ఇందులో భాగంగా... ఆర్.కృష్ణయ్య.. వ్యవహారం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఆర్. కృష్ణయ్య.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నించే అభ్యర్థిని కులాలు, పార్టీలకు అతీతంగా గెలిపించుకునేందుకు మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి కాంగ్రెస్‌, వైసీపీ అంటే ఉప్పు, నిప్పు అనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య నిర్ణయంపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తిగా మారింది. అయితే వైసీపీ ఎంపీగా కాకుండా... బీసీ సంఘం నేతగా ఆయన ఈ పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది.

కాగా... ప్రస్తుతం తెలంగాణలోని ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మల్లన్న ఒక్కరే బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి. ఈ నేపథ్యంలోనే ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌ అభ్యర్థి అయినప్పటికీ బీసీ అభ్యర్థి అనే కోణంలో మల్లన్నకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక నేటితో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో... రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆరెస్స్ అభ్యర్థుల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా.. బీఆరెస్స్ నుంచి ఏనుగుల రాకేష్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.