Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు ప్రచారం... రోజా నుంచి క్లారిటీ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీలు మారుతున్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2024 9:42 AM GMT
పార్టీ మార్పు ప్రచారం... రోజా నుంచి క్లారిటీ వచ్చేసింది!
X

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీలు మారుతున్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో జగన్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. జరిగేది జరుగుతుందని అంటున్నారు. ఇక జరుగుతున్న ప్రచారానికి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు బలం చేకూర్చిన పరిస్థితి.

ఇదే సమయంలో మరికొంతమంది వైసీపీ రాజ్యసభ సభ్యులు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది! ఈ సమయంలో గోడమీద పిల్లులు (గోపి)లు శాశ్వతం కాదని.. వైసీపీలో జగన్, జెండా మోసే కార్యకర్తే శాశ్వతం అని మాజీమంత్రి పేర్ని నాని లాంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపీల వ్యవహారంపైనా, తనపై జరుగుతున్న ప్రచారంపైనా రోజా స్పందించారు.

అవును... ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీలు మారబోతున్నారంటూ తీవ్ర ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా రోజా గురించిన చర్చ బలంగా నడిచింది. ఆమె ఇకపై తమిళనాట రాజకీయాలు చేయబోతున్నారని, ఇందులో భాగంగా.. తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీలో ఆమె చేరబోతున్నార్నే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా.. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా కేవలం ఊహాగాణాలు మాత్రమే అని ఆమె తేల్చి చెప్పరు. ఇదే సమయంలో తాను పార్టీ మారడం లేదని.. జగనన్నతోనే ఉంటానని ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో... అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్తున్నవారు ఒకసారి పునరాలోచించుకోవాలని హితవు పలికారు. ఆపత్కాలంలో పార్టీకి ద్రోహం చేసినవారి ఎవరూ క్షమించరని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.

అనంతరం... కూటమి ప్రభుత్వ పాలనపై రోజా నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా... గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన ఘటనలపట్ల ప్రభుత్వం సిగ్గు పడాలని అన్నారు. ముచ్చుమర్రిలో ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా.. ఆ బాలిక శవాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారని ఆమె ఘాటు విమర్శలు చేశారు.

ఇంత జరిగినా ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. ఇక తాజా కలకలం గుడ్లవల్లేరు లోని ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో రహస్య కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఆందోళన చేసిన ఘటనపైనా స్పందించిన రోజా... దర్యాప్తు చేయకుండానే, విచారణ జరపకుండానే అక్కడ ఏమీ జరగలేదన్నట్లుగా ఎస్పీ చెప్పడం దారుణమని అన్నారు.

ఇదొక్కటే కాదని.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీల్లోనూ ర్యాగింగ్ విపరీతంగా పెరిగిందని.. నెల్లూరు నారాయణ కాలేజీలో ర్యాగింగ్ చేసి మెడికల్ విద్యార్థిని చంపేశారని.. కలిగిరి జే.ఎన్.టీ.యూ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకూందని ఆమె వెల్లడించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ఉన్న శ్రద్ధ.. మహిళలకు రక్షణ కల్పించడంపై కూడా ఉంచాలన్నారు.