Begin typing your search above and press return to search.

తమిళనాడులో గుడిలో మాజీ మంత్రి రోజా తీరుపై తీవ్ర విమర్శలు!

ప్రజాజీవితంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు చేసే చిన్న పనులు వారి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుంది.

By:  Tupaki Desk   |   17 July 2024 5:42 AM GMT
తమిళనాడులో గుడిలో మాజీ మంత్రి రోజా తీరుపై తీవ్ర విమర్శలు!
X

ప్రజాజీవితంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు చేసే చిన్న పనులు వారి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో దారుణ ఓటమితో డీలా పడిన ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు తన తీరుతో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తమిళ, తెలుగు మీడియా తో పాటు తెలుగు దేశం పార్టీ ఆమెపై ఘాటు విమర్శలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా తో పాటు సోషల్ మీడియా లోను వైరల్ గా మారటమే కాదు.. ఆమె తీరును తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ముదిరే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలంటూ.. దగ్గరకు రావొద్దంటూ చేతితో చెప్పటమే కాదు.. ఒక్క అడుగు వెనుక్కి వేసిన రోజాకు చెందిన వీడియో వైరల్ గా మారింది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్యస్వామి టెంపుల్ లో వరుషాభిషేకాన్ని నిర్వహించారు ఆర్కే రోజా. తన భర్తతో కలిసి వెళ్లిన ఆమె.. ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు.

సినీ నటి కావటం.. రాజకీయంగా ఆమెకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు పెద్ద ఎత్తున గుర్తింపు ఉంది. దీంతో.. ఆమెతో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు.ఈ క్రమంలో కొందరు ఆలయంలో పని చేసే మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం ఆమె వద్దకు వెళ్లారు. తనకు దగ్గరగా వస్తున్న వారిని తన చేతితో దూరంగా ఉండాలని చెప్పటంతో పాటు.. ఒక అడుగు వెనక్కి వేశారు. అదేమీ పట్టించుకోని మహిళా శ్రామికులు ఆమెతో ఫోటో దిగేసి సంతోషానికి గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావటం.. దీనిపై తమిళ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. దీంతో.. ఆర్కే రోజా తీరుపై ఇంగ్లిషు.. హిందీ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఆర్కే రోజా తీరుపైనా సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె తీరుపై మీడియాలో వస్తున్న విమర్శల్ని ఉటంకిస్తూ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రస్తావించటంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మరి.. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆర్కే రోజా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.