విధి ఎంత కఠినం.. ఈ విషాద ఉదంతం చదివితే గుండె బరువెక్కుతుంది
సంగారెడ్డి జిల్లా బీహెచ్ ఈఎల్ కు చెందిన సుభాష్ కు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియకు 2020లో పెళ్లైంది.
By: Tupaki Desk | 4 Jan 2024 4:30 AM GMTకొత్త సంవత్సర వేడుకల్ని ఆనందోత్సాహాలతో జరుపుకొని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఒక కుటుంబం దారుణ రోడ్డుప్రమాదానికి గురి కావటం.. అందులో తల్లిని.. భార్యను.. చిన్నారి కుమార్తెను పోగొట్టుకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి వేదనను చూస్తే కన్నీళ్లు ఆగవు. సోషల్ మీడియాలో మొదలైన పరిచయం ప్రేమగా మారి.. నాలుగేళ్ల అనంతరం పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న వీరి జీవితాన్ని చూస్తే.. ఆనందాల పొదరిల్లు అన్నట్లుగా ఉంటుంది. అలాంటి కుటుంబం విధి ఆడిన వింతనాటకంలో తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. మళ్లీ ఎప్పటికి కోలుకోలేని రీతిలో సాగిన ఈ విషాదంలోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా బీహెచ్ ఈఎల్ కు చెందిన సుభాష్ కు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియకు 2020లో పెళ్లైంది. వారిద్దరు సోషల్ మీడియాలో పరిచయం కావటం.. నాలుగేళ్లు ప్రేమ సాగింది. చివరకు ఇరువైపులా ఉన్న పెద్దల్నిఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరి ప్రేమకు చిహ్నంగా గణిష్కా పుట్టింది. కొత్త సంవత్సరాన్ని అత్తగారింట్లో జరుపుకోవటానికి తల్లిని.. భార్యను..కుమార్తెను.. చెల్లి.. బావ.. మేనల్లుడ్ని తీసుకొని డిసెంబరు 30న కారులో విశాఖకు వెళ్లారు.
కొత్త సంవత్సరం జనవరి 1ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగానే భార్య మరోసారి గర్భవతి అయ్యిందన్న తీపివార్తను తెలుసుకున్నారు. రెట్టింపు ఆనందంతో జనవరి 2 ఉదయం పదిగంటల వేళలో గాజువాక నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కారు ముందు సీట్లో సుభాష్ డ్రైవ్ చేస్తుండగా పక్క సీట్లో భార్య.. 19 నెలల కుమార్తె ఉన్నారు. మధ్య సీట్లో తల్లి.. చెల్లి ఉండగా.. చివరి సీట్లలో బావ.. మేనల్లుడు ఉన్నారు. ఊహించని విధంగా వీరి కారుకు ఎదురుగా వచ్చిన వాహనం బలంగా వీరి కారును ఢీకొనటంతో ముందు సీట్లో కూర్చున్న సుభాష్ భార్య.. కుమార్తె.. రెండో వరుసలో కూర్చున్న తల్లి మరణించారు.
డ్రైవ్ చేస్తున్న సుభాష్ గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. తల్లి.. భార్య.. పిల్లల కోసం తపిస్తున్నాడు. అతడికి జరిగిన వాస్తవాన్ని చెప్పకుండా దాచి పెట్టిన బంధువులు.. మెరుగైన వైద్యం కోసంమరో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా అబద్ధం చెప్పి అతన్ని ఊరడిస్తున్నారు. సుభాష్ కోలుకోవటం కోసం కఠిన నిజాన్ని అతడికి తెలీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాయదారిరోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కోలుకోలేని విషాదాన్ని తెచ్చి పెట్టిందని చెప్పాలి. ఇదంతా చదివిన తర్వాత విధి ఎంత కఠినమైనదన్న భావన కలుగక మానదు.