Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 10:30 AM GMT
డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో ఆయన ఇంటికి కన్నం పెట్టారు. ఆయన లేని సమయంలో ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌ ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో వారిని తనిఖీ చేయగా.. అసలు విషయం తెలిసింది. వారిని పశ్చిమబెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించగా.. తెలంగా డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వివరాలు వెల్లడించారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించామన్నారు. కాగా.. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

డిప్యూటీ సీఎం అమెరికా పర్యటనలో ఉండగా.. ఆయనతో పాటే ఆయన ఫ్యామిలీ కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న దొంగలు.. వారి ఇంటిలోకి దూరి బంగారం, వెండి ఆభరణాలతోపాటు పెద్ద ఎత్తును నగదును దోచుకెళ్లారు. అయితే.. దీనిపై తెలంగాణ పోలీసులు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ జరిగినప్పటికీ ఇంతవరకు ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. స్వయంగా డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ జరిగిందంటే రాష్ట్రంలో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

భట్టి ప్రస్తుతం అమెరికాలోని లాస్‌వేగాస్‌లో నిర్వహించిన మైన్ ఎక్స్ పో 2024ను సందర్శించారు. మైనింగ్ రంగంలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ మేరకు సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ రంగంలో సహకారాలు కోరినట్లు తెలిపారు.