అమ్మో లేడీ దొంగల ముఠా.. వీరి దొంగతనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
దొంగతనాలు చేయడంలో ఒక్కోరిది ఒక్కో శైలి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు దొంగతనాలు చేయడంలోనూ కొందరు దొంగలు ప్రత్యేక పంథాలో సాగుతున్నారు.
By: Tupaki Desk | 13 March 2024 8:01 AM GMTదొంగతనాలు చేయడంలో ఒక్కోరిది ఒక్కో శైలి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు దొంగతనాలు చేయడంలోనూ కొందరు దొంగలు ప్రత్యేక పంథాలో సాగుతున్నారు. ఇప్పుడు ఇలాగే ఒక లేడీ దొంగల ముఠా ఏకంగా 66 కోట్ల రూపాయలు విలువ చేసే దొంగతనాలకు పాల్పడింది. ఈ ముఠా దొంగతనాలకు ఎంచుకుంటున్న ఐడియా తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక లేడీ దొంగల ముఠా వరుస దొంగతనాలతో ఇటీవల బెంబేలెత్తించింది. ఈ లేడీ దొంగల ముఠాతో అక్కడి దుకాణాల నిర్వాహకులకు కంటి మీద కునుకులేదు. అయితే ఈ లేడీ దొంగల ముఠా నగదునో, బంగారాన్నో దోచుకోవడం లేదు. కేవలం మేకప్ సామగ్రిని మాత్రమే దోచుకుంటోంది. అలా దోచుకున్న మేకప్ సామగ్రిని ఆన్ లైన్ ద్వారా అమ్మేసి కోట్ల రూపాయలు గడించింది.
ఈ మేరకు కాలిఫోర్నియా పోలీసు అధికారులు ఇటీవల మిషెల్ మాక్ (53) అనే ముగ్గురు పిల్లల తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిటైల్ స్టోర్లలో జరిగిన దొంగతనాలకు అసలు సూత్రధారి.. మిషెల్ మాక్ అని తేల్చారు. ఈమె నేతృత్వంలోని లేడీ దొంగల ముఠా ఏకంగా 8 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.66 కోట్లు) విలువైన మేకప్ సామగ్రిని దుకాణాల నుంచి దొంగిలించిందని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా బారినపడిన స్టోర్ల జాబితాలో అల్ట్రా, టీజే మ్యాక్స్, వాల్ గ్రీన్ వంటి ప్రముఖ సంస్థలు ఉండటం గమనార్హం.
శాన్ డియాగోలేని ఒక విలాసవంతమైన భవనంలో ఉంటున్న మిషెల్ మాక్ లేడీ దొంగలతో ఒక ముఠాను ఏర్పాటు చేసింది. నగలు, నగదు లాంటి విలువైన వస్తువులను కాకుండా వివిధ షాపుల్లో మేకప్ సామగ్రిని ఈ లేడీ దొంగల ముఠా దోచుకుంటుంది. మామూలు కస్టమర్ల మాదిరిగా బ్యాగులతో స్టోర్లకు వెళ్లే ఈ లేడీ ముఠా అక్కడి నిర్వాహకుల కళ్లు గప్పి అందినకాడికి మేకప్ సామగ్రిని తమ బ్యాగుల్లో పెట్టుకుని బయటపడుతుంది.
ఇలా షాపుల నుంచి దొంగిలించిన మేకప్ సామగ్రిని అమ్మేస్తే పోలీసులకు దొరికిపోతామని గ్రహించిన ఈ దొంగల ముఠా కొత్త పన్నాగంతో ముందుకొచ్చింది. దొంగిలించిన మేకప్ సామగ్రిని ఒక ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ లో విక్రయించింది. అయితే వారిని ఎట్టకేలకు అమెరికా పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు ‘కాలిఫోర్నియా గర్ల్స్’గా పేరుంది. కొన్నాళ్ల క్రితం ఈ ముఠా ఇంటిని అధికారులు తనిఖీ చేయగా దాదాపు 3,00,000 డాలర్ల విలువైన మేకప్ సామగ్రి లభించింది.
మిషెల్ మాక్ ఈ లేడీ దొంగల ముఠాను శాన్ డియాగోలోని ఓ విలాసవంతమైన భవనం నుంచి నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మిషెల్ మాక్ కాలిఫోర్నియా తీరంలోని 10 రాష్ట్రాల్లోని స్టోర్ల నుంచి మేకప్ సామగ్రిని దొంగిలించడం కోసం మొత్తం 12 మంది లేడీ దొంగలను నియమించుకొంది.
కాగా దొంగల ముఠా దొంగతనం చేయాల్సిన స్టోర్‌ను ముందుగా మిషెల్ మాక్ సందర్శిస్తుంది. అది దొంగతనానికి అనువుగా ఉందో లేదో గమనిస్తుంది. ఆ స్టోర్ లో వేటిని దొంగిలించాలో ఒక అంచనాకొస్తుంది. ఆ తర్వాత తన ముఠాను రంగంలోకి దింపుతుంది. ముఠా సభ్యులు ఖరీదైన బ్యాగ్ లలో మేకప్ సామగ్రిని దాచేసి బయటపడేవారు.
ఇలా ఇప్పటివరకు ఈ ముఠా టెక్సాస్, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడింది. ఇలా దొంగతనంగా తెచ్చిన మేకప్ సామగ్రిని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఓ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా మిషెల్ మాక్ విక్రయించేది.