Begin typing your search above and press return to search.

చివరకు అమెరికా అధ్యక్షుడి విమానాన్ని కూడా వదల్లేదు!

ప్రపంచ దేశాలకు పెద్దన్న, అగ్ర రాజ్యంగా అమెరికా హవా చలాయిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన నేత.

By:  Tupaki Desk   |   1 April 2024 9:30 AM GMT
చివరకు అమెరికా అధ్యక్షుడి విమానాన్ని కూడా వదల్లేదు!
X

ప్రపంచ దేశాలకు పెద్దన్న, అగ్ర రాజ్యంగా అమెరికా హవా చలాయిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన నేత. ఆయన ఉండే నివాసం, ప్రయాణించే విమానం ఇలా అన్నీ ప్రత్యేకమే. అమెరికా అధ్యక్షుడు నివసించే భవంతిని వైట్‌ హౌస్‌ అంటారనే విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు, ఏర్పాట్లు ఉన్నాయి. అణుదాడిని కూడా తట్టుకోగలిగేలా ప్రత్యేక బంకర్లు కూడా ఉన్నాయి.

ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’ అనే పేరుంది. దీనిలో అనేక అత్యాధునిక సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయి. క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను కూడా తట్టుకోగల రక్షణ వ్యవస్థ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో అందుబాటులో ఉంది. అగ్ర రాజ్యాధినేత ప్రయాణించే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు.

అయితే అలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో వరుస చోరీలు జరుగుతుండటం అమెరికా అధికార వర్గాలను హడలెత్తిస్తోంది. వరుస దొంగతనాలు చోటు చేసుకుంటుండటంతో నిఘా ఏర్పాటు చేసిన భద్రతాధికారులు చివరకు దొంగలను కనిపెట్టారు.

అమెరికా అధ్యక్షుడి విమానం.. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో వరుస దొంగతనాలు చేస్తోంది.. మరెవరో కాదు మీడియా ప్రతినిధులని తేలింది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా దేశీ, విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆయనతోపాటు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులను కూడా వెంట తీసుకెళ్తారు. వారు సైతం అమెరికా అధ్యక్షుడితోపాటే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణిస్తారు.

ఈ క్రమంలో తాము అమెరికా అధ్యక్షుడితో కలిసి విమానంలో, అదీ కూడా ఆయన సొంత విమానంలో ప్రయాణించామని చెప్పుకోవడానికి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో మీడియా ప్రతినిధులు దొంగతనాలకు పాల్పడుతున్నారట. స్వయంగా ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక.. ‘పొలిటికో’ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడితోపాటు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించే మీడియా ప్రతినిధులు అందులోని విస్కీ, వైన్‌ గ్లాసులు, బంగారం పూత పూసిన పింగాణీ ప్లేట్లు... ఇలా ఏది కనిపిస్తే దాన్ని దొంగిలిస్తున్నారట. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ బ్యాగుల్లో పెట్టేసుకుని వెంట తెచ్చేసుకుంటున్నారట.

మీడియా ప్రతినిధుల వరుస దొంగతనాలు రచ్చకెక్కడంతో ఇటీవల ది వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్‌ (ఎన్‌బీసీ) మీడియా ప్రతినిధులను మందలించారు. అమెరికా అధ్యక్షుడితోపాటు తాము ప్రయాణించామని చెప్పుకోవాలని కోరిక ఉంటే తామే అమెరికా అధ్యక్షుడితో ఉన్న వారి ఫొటోలను పంపుతామని.. దొంగతనాలు మానుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల పిల్లో కేస్‌ ను దొంగిలించిన ఒక మీడియా ప్రతినిధి తిరిగి దాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేశారని తెలుస్తోంది.