రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత అప్పు రూ.10వేల కోట్లు
'రాబర్ట్ టి కియోసాకి' పేరు చెప్పి.. అతడెవరు? అని ప్రశ్నిస్తే తెల్లముఖం వేయాల్సిందే
By: Tupaki Desk | 5 Jan 2024 5:07 AM GMT'రాబర్ట్ టి కియోసాకి' పేరు చెప్పి.. అతడెవరు? అని ప్రశ్నిస్తే తెల్లముఖం వేయాల్సిందే. అదే సమయంలో 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత పేరు చెప్పమంటే.. చాలామంది చెప్పే వీలుంది. సమకాలీన ప్రపంచంలో అందరిని ఆకర్షించి.. కోట్లాది మంది చదివేలా చేసిన పుస్తకాల్లో ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్. దాదాపు 10 కోట్ల కాపీలు పబ్లిష్ కావటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లోనూ ఈ పుస్తకం అనుమాదమైంది.
ప్రపంచ ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేసి.. వారి ఆర్థిక అంశాల మీద ఉండే దృక్ఫధాన్ని మార్చేలా చేయటంలో ఈ పుస్తకం ఎంతో చేసిందని చెప్పాలి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ లో లావాదేవీలతో పాటు.. బంగారం..వెండి లాంటివి కొనుగోలు చేయటం లాంటి ఎన్నో అంశాల్ని ప్రస్తావించిన ఈ పుస్తక రచయిత..తాజాగా తనకున్నఅప్పు రూ.10వేల కోట్లకు చేరుకుందని చెప్పటం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.
ప్రస్తుతం తాను అప్పులో ఉన్నట్లుగా కియోసాకి పేర్కొన్నారు. అయితే.. ఆయన చేసిన అప్పు ఏ తరహాలోనిది అన్నది చూసినప్పుడు మాత్రం ఆయన చతురత కనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వారు చాలామంది విలాసాల కోసం అప్పు చేస్తారని.. తాను మాత్రం ఆస్తులు కొనటానికి అప్పులు చేస్తానని చెప్పే ఆయన.. ''ఫెరారీ.. రోల్స్ రాయిల్స్ లాంటి విలాసవంతమైన వాహనాలు అప్పు. అవి ఆస్తులు కావు. సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను. ఆ మొత్తాన్ని వెండి.. బంగారం రూపంలోకి మారుస్తా' అని చెబుతారు.
పెట్టుబడుల్లో భాగంగా తాను చేసిన అప్పు ఇప్పుడు 1.2 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే.. రూ.10వేల కోట్లుగా చెప్పాలి. అయితే..ఆయన మాటల్నిచూస్తే.. ఆయనకున్న అప్పు ఆస్తుల పెట్టుబడే కావటంతో ఆయన్ను అప్పులు పాలైనట్లుగా అంచనా వేయటం తప్పే అవుతుంది. ఈ సందర్భంగా ఆయన తన పుస్తకంలో రాసిన అంశాల్నిప్రస్తావిస్తున్నారు.
డబ్బును మరింత పెంచేలా పెట్టుబడి పెట్టేందుకు చేసే అప్పుల్ని గుడ్ డెట్ అని ఆయన రాయటం తెలిసిందే. ఆయన వాదన ప్రకారం.. 'డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాలో ఉండటం కంటే మంచి రాబడులు వచ్చే మార్గల్లో పెట్టుబడి పెట్టాలి. స్టాక్ మార్కెట్ లో డివిడెంట్ ఇచ్చే స్టాక్ లో పెట్టుబడి పెట్టాలని.. మార్కెట్ ఒడుదొడుకులకు గురైతే బంగారం.. రియల్ ఎస్టేట్ లో మదుపు చేయాలి'' అని తన పుస్తకంలో రాశారు. ఇప్పుడు అవే సూత్రాల్ని ఆయన తన రియల్ లైఫ్ లోనూ అనుసరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.