Begin typing your search above and press return to search.

హాట్‌ టాపిక్‌.. స్కూల్‌ హెడ్‌ టీచర్‌ గా 'రోబో'!

వివరాల్లోకెళ్తే.. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే)లో వెస్ట్‌ సస్సెక్స్‌ లో ఉన్న కాట్స్‌ మోర్‌ స్కూల్‌.. 'ప్రిన్సిపల్‌ హెడ్‌ టీచర్‌' గా ఒక రోబోను నియమించుకుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 9:17 AM GMT
హాట్‌ టాపిక్‌.. స్కూల్‌ హెడ్‌ టీచర్‌ గా రోబో!
X

ఒకప్పుడు మనుషులు చేసే పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చేసేస్తోంది. దీంతో ఆయా పనుల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతోంది. ఉద్యోగులకు బదులుగా ఏఐ టెక్నాలజీతో రోబోలు రంగప్రవేశం చేస్తున్నాయి. తయారీ, వినియోగదారులకు సేవలు, ఆరోగ్య సంరక్షణ, రవాణాతో సహా వివిధ రకాల పరిశ్రమలలో ఏఐ రోబోలు ప్రవేశించాయి.

అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు స్కూల్‌ హెడ్‌ టీచర్‌ గా ఒక రోబోను నియమించుకోవడం విశేషం. వివరాల్లోకెళ్తే.. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే)లో వెస్ట్‌ సస్సెక్స్‌ లో ఉన్న కాట్స్‌ మోర్‌ స్కూల్‌.. 'ప్రిన్సిపల్‌ హెడ్‌ టీచర్‌' గా ఒక రోబోను నియమించుకుంది. స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ కు వివిధ అంశాల్లో సహాయం చేసేందుకు ఏఐ టెక్నాలజీతో పనిచేసే బెయిలీ అనే రోబోను ప్రిన్సిపల్‌ హెచ్‌ టీచర్‌ గా నియమించారు.

కాట్స్‌ మోర్‌ స్కూల్‌ లో బాలురు, బాలికలు ఉన్నారు. ఇది ఒక అకడమిక్, బోర్డింగ్‌ స్కూల్‌. కాట్స్‌ మోర్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు టామ్‌ రోజర్సన్‌ మాట్లాడుతూ.. తోటి సిబ్బందికి, విద్యార్థులకు సహాయం చేయడం, పాఠశాల విధానాలను అనుసరించడం, వివిధ సమస్యలపై తనకు సలహాలు ఇవ్వడానికి ఈ రోబోట్‌ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు తమ ప్రశ్నలను టైప్‌ చేయగానే సమాధానాలిచ్చే చాట్‌ జీపీటీ మాదిరిగానే ఈ రోబో కూడా పనిచేస్తుంది. అలాగే ఆ ప్రశ్నలకు చాట్‌ బాట్‌ అల్గారిథమ్‌ ల ద్వారా సమాధానాలను కూడా రోబో అందిస్తుంది.

మెషిన్‌ లెర్నింగ్, ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్‌ లో విస్తారమైన డేటాను విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ఈ రోబోను అభివృద్ధి చేశారు. ''కొన్నిసార్లు మీకు సహాయం చేయడానికి ఎవరైనా లేదా ఏదైనా కలిగి ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది' అని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. 'నమ్మలేని విధంగా బాగా శిక్షణ పొందిన ఎవరైనా మనకు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తే అది ఎంతో బాగుంటుంది' అని ఆయన చెప్పారు.

రోబో ఉన్నంతమాత్రాన తాను ఇతరుల నుంచి సలహాలు తీసుకోబోననేది అర్థం కాదని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అయితే సహాయం కోసం తాను ఎవరిని పిలవాల్సిన అవసరం లేకుండా, వారి కోసం వేచి ఉండే పని లేకుండా, తనకు సహాయం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే తాను రోబోను సహాయంగా నియమించుకున్నానని చెప్పారు.

స్కూల్‌ కు అధిపతిగా, హెడ్‌ మాస్టర్‌ గా నాకు చాలా బాధ్యతలున్నాయి. వీటిలో సహాయం చేయడానికి ఏఐ రోబో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

కాగా కాట్స్‌ మోర్‌ పాఠశాల విద్యార్థులకు సంవత్సరానికి దాదాపు 32000 పౌండ్ల (రూ.32,48,121) వరకు ఫీజులు వసూలు చేస్తుంది. నాలుగు– 13 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలు, బాలికలకు ఇక్కడ హాస్టల్‌ వసతి కూడా ఉంది.