ఈ క్రికెటర్లకు రతన్ టాటాకు ఉన్న బంధం ఇదే... రోహిత్ ఇంట్రస్టింగ్ పోస్ట్!
క్రీడాకారులకు కూడా రతన్ టాటా ఎంతో మద్దతుగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల ద్వారా పలువురు క్రికెటర్లకు ఆయన ఎంతో సాయం అందించారు.
By: Tupaki Desk | 11 Oct 2024 4:30 AM GMTపారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 9 రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముంబై లోని ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 10 సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో హిందూ సంప్రదాయంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా దేశం మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
ఈ సందర్భంగా దేశానికి ఆయా రంగాల్లో రతన్ జీ చేసిన సేవలను ప్రజలంతా కొనియాడారు.. మూగజీవాలపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు.. ఆయన దాతృత్వాన్ని స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో క్రీడారంగంలోనూ ఆయన చేసిన సేవలు, పలువురు క్రీడాకారులకు ఆయన ఎంతో మద్దతుగా నిలిచిన విషయాలు తెరపైకి వచ్చాయి.
అవును... వ్యాపార రంగంలోనే కాకుండా.. క్రీడాకారులకు కూడా రతన్ టాటా ఎంతో మద్దతుగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల ద్వారా పలువురు క్రికెటర్లకు ఆయన ఎంతో సాయం అందించారు. ఈ జాబితాలో మాజీలతో పాటు యంగ్ ప్లేయర్లూ ఉన్నారు. వారికి ఆర్థికంగా అండగా నిలవడంకోసం తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేవారు.
ఈ జాబితాలో అలనాటి క్రికెటర్లు మొహిందర్ అమర్నాథ్, ఫరూఖ్ ఇంజినీర్ కూడా ఉండగా... బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నారు. ఇదే క్రమంలో... జవgaల్ శ్రీనాథ్, మహమద్ కైఫ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సంజయ్ మజ్రేకర్ లకు తమ గ్రూపులో ఉద్యోగాలు కల్పించారు రతన్ టాటా.
వీరితో పాటు జయంత్ యాదవ్, శార్థూల్ ఠాకూర్ కూడా టాటా గ్రూప్ నుంచి సాయం అందుకున్నవారే. ఈ విధంగా పలువురు క్రికెటర్లకు తమ గ్రూపులో ఉద్యోగాలు కల్పిస్తూ.. స్పాన్సర్ చేస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహించారు.
ఇలా క్రికెటర్లకు పర్సనల్ గా సాయం చేయడమే కాకుండా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను టాటా స్పాన్సర్ షిప్ చేస్తోంది. వివోతో బీసీసీఐ వివాదం వేళ టాటా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా టైటిల్ స్పాన్సర్ గా 4 ఏళ్ల కాలానికి రూ.2,500 కోట్లతో డీల్ చేసుకుంది. ఇదే క్రమంలో మహిళల ప్రీమియర్ లీగ్ ను కూడా టాటానే స్పాన్సర్ చేస్తోంది.
అలా క్రికెట్ రంగానికి, బీసీసీఐ కు తోడుగా నిలిచిన రతన్ టాటా కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా రతన్ జీ ని “బంగారు మనసు కలిగిన మారాజు” అని సంబోధించిన రోహిత్ శర్మ... 'సర్ మీ సెవలను ఎప్పటికీ మరిచిపోలేం.. భారతీయులకు మెరుగైన జీవనం కోసం నిరంతరం శ్రమించారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆశిస్తున్నాను" అని పోస్ట్ పెట్టాడు.