Begin typing your search above and press return to search.

'ప్రజలిచ్చిన ఓటమి కాదు'... ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 5:19 AM GMT
ప్రజలిచ్చిన ఓటమి కాదు... ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొంతమంది నేతలు తమ ఓటమికి పలు కీలక కారణాలు ఉన్నాయని చెబుతుండగా.. మరికొంతమంది మాత్రం ఇది కచ్చితంగా ప్రజలు ఇచ్చిన ఓటమి కాదంటూ కమెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా కూడా ఇలానే స్పందించారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓటమిపై మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇందులో భాగంగా... ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరి నియోజకవర్గం పుత్తురులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పందించిన రోజా.. "ఎన్నికలు సునామీలా జరిగిపోయాయి.. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు.. ఎందుకంటే మనం ఏ తప్పూ చేయలేదు.. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్సార్సీపీ నాయకత్వం, పార్టీ, ఎమ్మెల్యేలు చేయలేదనేది తాను మాత్రం గంటాపథంగా చెప్పగలను.. ఏమి జరిగిందనేది ఈ రోజు కాకపోతే రేపు బయటకైతే వస్తుంది" అని అన్నారు.

ఇదే సమయంలో... "కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మ్మెల్యేలుగా పనిచేసినప్పుడే కాదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను.. మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడే ఉంటాను.. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను.. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను" అని రోజా నగరి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాగా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రోజా సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే. అడపాదడపా ట్విట్టర్ పోస్టులు మినహా ఆమె పెద్దగా రాజకీయాలపై స్పందించింది లేదు! మాజీ టూరిజం మంత్రిగా రుషికొండ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో మాత్రం స్పందించి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా జనాల్లోకి వచ్చిన ఆమె... ఎన్నికల ఫలితాలపై ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు.