ఫలితాలపై రోజా మాట ఇప్పటికీ అదే... కారణం ఇదే!
దీంతో.. ఆ ఫలితాలపై ఇప్పటికీ తీవ్రంగా చర్చ జరుగుతుందనే విషయం అర్ధమవుతుందని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Nov 2024 8:43 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఇప్పటికీ తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వైసీపీకి 11 సీట్లే ఎందుకు వచ్చాయో నివేదిక ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని రాబిన్ శర్మ అడిగారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో.. ఆ ఫలితాలపై ఇప్పటికీ తీవ్రంగా చర్చ జరుగుతుందనే విషయం అర్ధమవుతుందని అంటున్నారు.
మరోపక్క ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆ షాక్ నుంచి తేరుకొన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఈవీఎం లలో ఫ్రాడ్ జరిగిందనే విషయాన్ని పరోక్షంగా ఎత్తి చూపారనే చర్చ జరిగింది! ఈ విషయంపై ఇప్పటికీ పలువురు వైసీపీ నాయకులు స్టిక్ ఆన్ అయ్యి ఉన్న పరిస్థితి. ఈ సమయంలో రోజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై వైసీపీ నేతలు రకరకాల కారణాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమ ఓటమికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉన్న ఆ కోటరీనే అని ఒకరంటే.. లిక్కర్ పాలసీనే తమ ఓటమికి ప్రధాన కారణం అని మరొకరు వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఈవీఎంలలో గోల్ మాల్ జారిగాయని ఎక్కువమంది ఇప్పటికీ నమ్ముతున్నారని అంటారు. ఈ సమయంలో నాటి పరిస్థితులు, కౌంటింగ్ సెంటర్ నుంచి రెండో రౌండ్ పూర్తవ్వగానే వెళ్లిపోవడం.. అందుకు కారణం అయిన కీలక విషయంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... తొలి రౌండ్లో తనకు బాగా కలిసివచ్చే వడమాలపేట ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అయితే అక్కడే ప్రత్యర్థికి 3వేల మెజారిటీ రావడం చూసి తాను షాక్ తిన్నానని.. దీంతో ఎన్నికలు సక్రమంగా జరగలేదని, ఈవీఎంలలో ఏదో చేశారని అర్థమై.. తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.
తాను నగరి నియోజకవర్గంలో ఎంతో చేశానని.. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేశామని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు, మూడు వేల ఓట్లతోనె గెలిచిన చోట ఆయన కుమారుడు మాత్రం 40 వేల మెజారిటీతో ఎలా గెలుస్తాడు అంటూ రోజా ప్రశ్నించారు.
ఇదే సమయంలో... ఎన్నికలకు సుమారు రెండు నెలల ముందు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా తెలిపారు. అందుకే ఈ ఎన్నికలను తాను నమ్మడం లేదని.. ప్రతీ ఇంటికీ ఎంతో మంచి చేసిన జగన్ లాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసె పరిస్థితి లేదని ఆమె తెలిపారు.