'సంధ్య థియేటర్ - తిరుపతి ఘటన'... రోజా సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.
By: Tupaki Desk | 9 Jan 2025 9:24 AM GMTతిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా... తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.
ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... బాధితులను పరామర్శించిన హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన ప్రమాదమా.. లేక, కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదే సమయంలో... తిరుపతిలో జరిగిన ఈ పెనువిషాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఈ నివేధికలో... డీఎస్పీ అత్యుత్సాహం వల్లే భక్తులంతా ఒక్కసారిగా రావదంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోపక్క అధికారులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
మరోపక్క... ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. లో బీ.ఎన్.ఎస్. సెక్షన్ 194 పెట్టారని.. అంటే.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కాదని.. కేవలం ప్రమాదవశాత్తు జరిగిందన్నట్లుగా కేసు నమోదు చేశారని.. వాస్తవానికి 105 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... తిరుపతిలో జరిగిన పెనువిషాదంపై స్పందించిన ఆర్కే రోజా... చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో చావులే అని.. గతంలో పుష్కరాల్లో తొక్కిసలాట, నేడు వైకుంఠ ఏకాదశి ముందు ఈ దారుణం జరిగిందని.. టీటీడీ చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని.. దీనికి పూర్తిగా ప్రభుతం, టీటీడీ అలసత్వమే కారణం అని రోజా అన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ప్రస్థావించారు రోజా. ఇందులో భాగంగా... సంధ్య థియేటర్ లో ఆయనకు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఓ మహిళ చనిపోతే అల్లు అర్జున్ పై బీ.ఎన్.ఎస్.105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని రోజా గుర్తు చేశారు.
అలాంటప్పుడు ఇక్కడ ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి.. వారికి భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నుంచి టీటీడీ ఛైర్మన్, పాలక మండలి నుంచి కింది స్థాయి పోలీసుల వరకూ అందరూ బాధ్యత వహించాలి కదా అని రోజా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎఫ్.ఐ.ఆర్. కాపీలను చూపించారు.
ఇందులో భాగంగా... పద్మావతి పార్కులో ఐదు మంది చనిపోతే సెక్షన్ 105 కింద కేసులు పెట్టాల్సిందిపోయి వీళ్లు సెక్షన్ 194 పెట్టారని.. ఇదే క్రమంలో... విష్ణు నివాసం వద్ద ఒకరు చనిపోతే అక్కడ కూడా ఇదే విధంగా సెక్షన్ పెట్టి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని రోజా తెలిపారు. అంటే.. దీనికి ఎవరూ బాధ్యులు కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని చెప్పలనుకుంటున్నారని మండిపడ్డారు.