Begin typing your search above and press return to search.

ట్వీట్లతో సరిపెడుతున్న రోజా

ఆ విధంగా పార్టీ పునాదుల నుంచి ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల వరకూ అదే ఫైర్ తో పనిచేశారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:58 PM GMT
ట్వీట్లతో సరిపెడుతున్న రోజా
X

వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే కచ్చితంగా చెప్పే పేరు ఆర్కే రోజా. ఆమె 2009 ఎన్నికల ఫలితాల తరువాత ఆనాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ని కలసి కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ విధంగా పార్టీ పునాదుల నుంచి ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల వరకూ అదే ఫైర్ తో పనిచేశారు.

అయితే పార్టీ ఓటమి పాలు అయిన తరువాత మాత్రం రోజా కనిపించడం లేదు అన్న చర్చ అయితే ఉంది. రోజా గతంలో మాదిరిగా మీడియా ముందుకు రావడం లేదు, ధాటీగా రియాక్ట్ కావడం లేదు అన్న మాట ఉంది. ఏపీలో చూస్తే పసి పిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు వరసబెట్టి జరుగుతున్నాయి. వీటి మీద టీడీపీ కూటమి సర్కార్ ని నిగ్గదీయాల్సిన నేపథ్యంలో రోజా కేవలం ట్విట్టర్ కే పరిమితం అవుతున్నారు.

తాజాగా పిఠాపురంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం ఘటనలో రోజా ట్విట్టర్ ద్వారా పవన్ మీద విమర్శలు కురిపించారు. అందులో కాస్తా గట్టిగానే పవన్ మీద పంచులేశారు. అయితే తన సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో పసి బాలిక కిడ్నాప్ హత్య ఉదంతం కూడా ఇటీవల హీటెక్కించింది. అయినా రోజా నుంచి స్ట్రాంగ్ గా కామెంట్స్ రాలేదని అంటున్నారు

అదే సమయంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో మహిళలకు పసి పిల్లలకు రక్షణ లేదని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను కూడా రంగంలోకి దించారు. ఆమె వీడియో బైట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడ మీడియా మీటింగ్ పెట్టి మరీ పదునైన విమర్శలు చేశారు.

ఈ ఇద్దరూ రాజకీయంగా చూస్తే రోజా కంటే జూనియర్లుగానే ఉన్నారు. అయితే రోజా ఫైర్ బ్రాండ్ గా చేసే విమర్శలు వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. ఆమె మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కానీ ఎందుకు రావడం లేదు అన్న చర్చ సాగుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే రోజా జీవిత లక్ష్యం అయిన మంత్రి పదవిని అందుకోవడం నెరవేరిందని అందుకే ఆమె రాజకీయంగా ఇపుడు నిదానం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ప్రత్యక్ష పోరాటానికి ఇంకా తగిన సమయం రాలేదని భావించే ఆమె ట్విట్టర్ కి పరిమితం అవుతున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా రోజా లాంటి ఫైర్ బ్రాండ్ కనిపించకుండా ఎంత విమర్శించినా అది అధికార కూటమికి ఎక్కదని అంటున్నారు. మరి రోజా కూటమి మీద డైరెక్ట్ ఫైట్ కి ఎపుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియదు అని అంటున్నారు.