Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమందా? దేవాన్షు కూడా వదలవా రోజా?

అంతేకాదు.. బ్రాహ్మణి మాట్లాడిన మాటలపై అప్పుడు తీర్పులు ఇచ్చేస్తున్న రోజా తొందరపాటు పార్టీకి నష్టం చేసేలా మారుతుందంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:15 AM GMT
బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమందా? దేవాన్షు కూడా వదలవా రోజా?
X

రాజకీయాల్లో తమకు తాము గొప్పోళ్లుగా కీర్తించుకోవటం కొందరు నేతలకు అలవాటు. తమ గురించి తమ తెలివి గురించి గొప్పులు చెప్పుకోవటం వరకు ఓకే. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. టీడీపీతో పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రకటించిన వైనంపై నిప్పులు చెరిగిన రోజా.. అదే ఊపులో.. బ్రాహ్మణిపైనా పంచ్ లు వేయటం.. చివరకు చిన్న పిల్లాడైన దేవాన్ష్ ను వదలకుండా సెటైర్లు వేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

పవన్ ను మాటలు అనేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నారు.. ఒక ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న ఆయన్ను తన మాటలతో ఉతికి ఆరేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని బ్రాహ్మణిపై మండిపాటు సరికాదంటున్నారు. తన మామయ్యను అరెస్టు చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో ఆమె మాటల్ని ఆవేదన స్థాయిలోనే చూడాలే తప్పించి.. రాజకీయ విమర్శల వరకు తీసుకెళ్లకూడదు.

ఒకవేళ బ్రాహ్మణి రాజకీయంగా ఏదైనా పదవి తీసుకున్నా... పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆమెను విమర్శించటం తప్పు కాదు. అందుకు భిన్నంగా రాజకీయాలతో నేరుగా ఎలాంటి సంబంధం లేని ఆమెను నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం ఎలా? అన్నది ప్రశ్న. అంతేకాదు.. బ్రాహ్మణి మాట్లాడిన మాటలపై అప్పుడు తీర్పులు ఇచ్చేస్తున్న రోజా తొందరపాటు పార్టీకి నష్టం చేసేలా మారుతుందంటున్నారు. తిట్టేవాళ్లను తిట్టాలి. టార్గెట్ చేయాల్సిన వారిని టార్గెట్ చేయటం వరకు ఓకేనని.. అలా అని అందరిపైనా మాటలు రువ్వటాన్ని ప్రజలు హర్షించరన్న విషయం రోజా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడిన బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమందన్న రోజా.. 'చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారని బ్రాహ్మణి అంటోంది. సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ జైలర్ సినిమాకు పంపుతారా? దయచేసి దేవాన్షుకు బాబు రిమాండ్ రిపోర్టు చూపించొద్దు. వాళ్ల తాత ఎంత పెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది'' అంటూ చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజకీయాల్లో ఉన్న వారిపై ఎన్ని మాటలు అన్నా సర్లే అని అనుకోవచ్చు. కానీ.. రాజకీయాలతో సంబంధం లేని చిన్న పిల్లాడ్ని సైతం రాజకీయ విమర్శల కోసం వాడేసుకోవటం మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.