వాళ్లెంత? వాళ్ల ప్రాణమెంత? ఎన్నికలప్పుడు ఇవేం మాటలు రోజా?
చిన్న మాటలు.. పెద్ద పరిణామాలకు దారి తీస్తాయన్న విషయాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 6 May 2024 3:45 AM GMTచిన్న మాటలు.. పెద్ద పరిణామాలకు దారి తీస్తాయన్న విషయాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తానిప్పుడు ఎన్నికల బరిలో ఉన్నానన్న విషయాన్ని ఆమె మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నారు. తానింకా జబర్దస్త్ సెట్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రోజా స్థాయితో పోలిస్తే.. గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్ లాంటి వారు చాలా చాలా చిన్నవారు. నటులుగా వారి స్థాయి చిన్నది కావొచ్చు. అంత మాత్రాన చులకన చేయటం సరికాదు.
రీల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరన్నట్లు.. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు ఉండే బంధాలకు.. అదే మేకప్ తీసేసిన తర్వాత కూడా అదే వ్యవహారశైలితో లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతోంది. తాను నటి మాత్రమే కాదు.. బాధ్యత కలిగిన నేతగా మారిన విషయాన్ని ఆర్కే రోజా మర్చిపోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిటాపురంలో ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారు. పవన్ అండ్ కోను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అలాంటిది ఆర్కే రోజా అదే తీరును ప్రదర్శించాలి కదా? అందుకు భిన్నంగా ఆమె నోటి నుంచి వస్తున్న మాటలు ఆమెకు నష్టాన్ని కలుగజేసేలా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న జబర్దస్త్ ఫేం గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్ తదితరులపై రోజా వ్యాఖ్యానిస్తూ.. ‘‘వాళ్లెంతండీ? వాళ్ల ప్రాణమెంత? వీరితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలే కానీ వీరిని అనడం వేస్ట్. వీళ్లంతా చిన్న షోస్ చేసుకుంటూ.. చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. మీకు తెలియంది ఏముంది? మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండాచేస్తారనే భయంతో వారు ఆ కుటుంబంతో ఉన్నారు. ప్రేమతో ఎవరు లేరు’’ అంటూ వ్యాఖ్యానించారు.
అదే నిజమని అనుకుందాం. మరి.. యాంకర్ శ్యామల స్థాయి ఏమిటి? అలీ పరిస్థితేంటి? ఆ లెక్కన వైసీపీకి మద్దతుగా నిలిచి.. ప్రచారం చేస్తున్న వారికి సైతం రోజా చెప్పిన మాటల్ని అప్లై చేస్తే? నిజంగానే మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారన్న వాదనే నిజమైతే.. వైసీపీ తరఫున ఎవరూ ప్రచారం చేయకూడదు కదా? అంతెందుకు రోజా సంగతే తీసుకుందాం? ఆమేమీ మెగా ఫ్యామిలీలోని నటులతో పోలిస్తే ఆమె స్థాయి చాలా చాలా చిన్నది కదా? నిజంగానే వారికి అలాంటి మైండ్ సెట్ ఉండి ఉంటే.. ఈపాటికి ఆమెకు అవకాశాలు లేకుండా చేసే వారు కదా? మరి.. అలా ఎందుకు జరగలేదన్న లాజిక్ ప్రశ్నలు మెదడులో తలెత్తితే వాటికి సమాధానాలేంటి?
మిగిలిన సమయాల్లో ఎలా అయినా మాట్లాడొచ్చు. కానీ.. ఎన్నికల వేళలో మాట్లాడే ప్రతి మాటకు వచ్చే స్పందన పాజిటివ్ అయితే ఓకే. అదే.. నెగిటివ్ అయితేనే కష్టం. ఈ విషయాన్ని రోజా మర్చిపోతున్నట్లున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కమెడియన్ గెటప్ శ్రీను స్పందించారు. ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన్ను ప్రశ్నించారు. రోజా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించినప్పుడు రియాక్టు అవుతూ.. ‘‘మెగా ఫ్యామిలీతో ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు. వెంకటేశ్.. ఎన్టీఆర్.. నానిలతోనూ కలిసి నటించా. ఇతర హీరోల చిత్రాల్లో నాకు ఆఫర్లు రావట్లేదా?’’ అంటూ ప్రశ్నించిన అతడు సెటిల్డ్ గా ఇచ్చిన సమాధానం అందరిని ఆకట్టుకుంటోంది.
ఏ మనిషీ అందరికీ నచ్చడని.. పవన్ కల్యాణ్ మీద అభిమానం ఉంది కాబట్టే.. జనసేన తరఫున ప్రచారం చేశానని చెప్పిన గెటప్ శ్రీను.. ‘‘కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల స్పందన బాగుంది. లక్ష మెజార్టీ వస్తుంది. పార్టీ వర్గాలు ఫోన్ చేయలేదు. నేను.. సుడిగాలి సుధీర్.. రాంప్రసాదర్ తదితరులం మాకు మేం వెళ్లాం. మేమే ఫోన్ చేసి వెళ్లాం. వాళ్లు రమ్మని అడగలేదు’’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఆర్కే రోజా వ్యాఖ్యల్లో అహంకారం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తే.. గెటప్ శ్రీను మాటల్లో అభిమానం కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.