Begin typing your search above and press return to search.

బండారు వ్యాఖ్యలపై రోజా... తల్లితండ్రుల పెంపకం అలాంటిది!

ఈ సమయంలో బండారు సత్యనారాయణ బూతు పంచాంగంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 10:37 AM GMT
బండారు వ్యాఖ్యలపై రోజా... తల్లితండ్రుల పెంపకం అలాంటిది!
X

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి... మంత్రి రోజా పై చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే. రాయడానికి, వినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేని వ్యాఖ్యలు బండారు మాట్లాడారు. దీంతో... ఆరున్నర పదుల వయసులో ఇంత కుసంస్కారంతో, విజ్ఞత మరిచి వ్యాఖ్యానిస్తారా అనే విమర్శలు వినిపించాయి. ఇక ఆర్జీవీ అయితే ఏకవచనంతో సంభోదిస్తూ గొంగలి పురుగుతో పోల్చిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బండారు సత్యనారాయణ మూర్తిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఈ సమయంలో బండారు సత్యనారాయణ బూతు పంచాంగంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని తనదైన శైలిలో పేర్కొన్నారు.

ఇదే సమయలో ఎదిగే మహిళను చూసి ఓర్వలేక పచ్చి మాటలు మాట్లాడుతున్నారని, క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడుతున్నారని, మహిళలను మానసికంగా వేదిస్తే ఇంటికి వెళ్లిపోతారులే అని అనుకుంటారని అన్నారు. ఈ సమయంలో ఇలాంటి పనులకు చట్టం ఊరుకోదని.. అలాంటి వారికి చట్టం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని రోజా అన్నారు. మహిళలు ఇలాంటి అవమానాల బారిన పడకుండా... వారు ఎంచుకున్న రంగాల్లో గౌరవంగా బ్రతికేలా ఈ విషయంలో న్యాయస్థానాలు తీర్పు చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తాజాగా తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్‌ కు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి టూరిజం మంత్రి ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా... దేశం మొత్తం మీద 75 చోట్ల నిర్మాణం చేయాలని ప్రధాని చక్ర విజన్ ఫౌండేషన్ కోరినట్లు తెలిపిన రోజా... ఏపీలో మూడు చోట్ల ట్రిబ్యూట్ వాల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

ఫలితంగా... మహనీయుల గొప్పతనం గురించి స్మరించుకునేలా ఈ నిర్మాణం జరగబోతుందని అన్నారు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా స్థానిక బాషల్లో ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయం వ్యవస్థను జగన్ తన పాలనలో తీసుకొచ్చారని అన్నారు.

అనంతరం... చంద్రబాబు, భువనేశ్వరి ఏదో త్యాగం చేసినట్లుగా దీక్ష చేస్తున్నారని మండిపడిన మంత్రి రోజా... ఆయన జీవితమే హింసా మార్గం అని, ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి ఆయనది అని, చంద్రబాబు చేస్తున్న దీక్ష గాంంధీజీని అవమానపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో వైసీపీకి 15 సీట్లు కూడా రావని పవన్ వ్యాఖ్యానించడంపై రోజా స్పందించారు. "మాకు 15 సీట్లు రావడం కాదు, పవన్ కు కనీసం 15 సీట్లకైనా అభ్యర్ధులు ఉన్నారా" అని ప్రశ్నించారు. అనంతరం సన్నాసీ సన్నాసి కలిస్తే రాలేది బూడిదే అని ఎద్దేవా చేశారు.