లెక్క తేలాలి.. పవన్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు!
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప, ఒక్క ప్రశ్న అదనంగా అడిగినా సమాధానం చెప్పలేడని రోజా ఎద్దేవా చేశారు.
By: Tupaki Desk | 28 July 2023 12:10 PM GMTపవన్ ని విమర్శించడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ విమర్శించలేరు అన్నట్లుగా సాగుతుంటుంది రోజా విమర్శల దాడి అని అంటుంటారు పరిశీలకులు. చెప్పాలనుకున్నది చెప్పేయడం.. అనాలనుకున్నది అనేయడం.. అన్న చందంగా ఆమె దూకుడు సాగుతుంటుందని అంటుంటారు. ఈ క్రమంలో ప్రతీ విమర్శలోనూ అర్ధవంతమైన భావం ఉంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ పై మరోసారి ఫైరయ్యారు మంత్రి రోజా!
వారాహి యాత్రలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ చేసిన అభ్యంతరకర కామెంట్స్ పై ఇంకా రాజకీయ రగడ రగులుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లో అదృశ్యమైన బాలికలు, యువతుల సంఖ్య ఇదీ అంటూ ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ చెప్పిన లెక్కల అనంతరం ఈ వ్యవహారం మరింతగా రాజుకుందని తెలుస్తోంది. ఈ సమయం లో పవన్ ట్వీట్లు, కామెంట్ల పై రోజా స్పందించారు.
అవును... శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన కు వెళ్లిన మంత్రి రోజా... అటు చంద్రబాబు పైనా, ఇటు పవన్ పైనా తీవ్రవ్యాఖ్యలు చేశారు. అసలు సిస్సలు సీమ ద్రోహి చంద్రబాబే అని ఆమె మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీమ కు ఇసుమంతైనా చేయలేదని తప్పు పట్టారు.
ముఖ్యమంత్రిగా ఉన్న ఆ దశాబ్ధన్నర కాలం సీమ ప్రాజెక్టులు అప్పుడెందుకు గుర్తు రాలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. ఇక చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజల కు ఉపయోగపడే విజన్ ఆయన ఏనాడూ కనిపెట్టలేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో గంజాయి హెరిటేజ్ లో మాత్రమే దొరుకుతుందని, రాష్ట్రంలో ఇంకెక్కడా దొరకడంలేదని.. నారావారిపల్లిలో ఎర్రచందనం వ్యాపారం సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రం లో ఇంకెక్కడా గంజాయి దొరకడంలేదని రోజా కామెంట్ చేశారు.
అనంతరం కరువుకు చంద్రబాబుకూ అవినాభావ సంబంధం ఉందని.. అది అలాంటి ఇలాంటి సంబందం కాదని చెప్పుకొచ్చిన రోజా... చంద్రబాబు పాలన లో కరవులు తప్ప, వర్షాలు పడలేదని విమర్శించారు. చంద్రబాబు - కరువు కవల పిల్లల ని వెటకరించారు. రెయిన్ గన్లతో కరువును పారదోలుతానని చెప్పి, చంద్రబాబు దాన్ని కూడా ఆర్థికంగా సొమ్ము చేసుకున్నారని మంత్రి మండిపడ్డారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిల మిస్సింగ్ పై పవన్ చేసిన ఆరోపణల పై స్పందించిన రోజా... పవన్ కల్యాణ్ వల్ల రాష్ట్రంలో ఎంత మంది మిస్ అయ్యారో లెక్కలు తీయండి సార్ అని వ్యంగ్యంగా అన్నారు. పవన్ కు రాజకీయ అవగాహన లేదని.. ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప, ఒక్క ప్రశ్న అదనంగా అడిగినా సమాధానం చెప్పలేడని రోజా ఎద్దేవా చేశారు.
ఇదే సమయం లో పవన్ ని అస్తమానం వార్డు మెంబరుగా కూడా గెలవ ని వ్యక్తి అని మాటల తో కుల్లబొడుస్తారనే పేరు సంపాదించుకున్న రోజా... మరోసారి అదే విషయాన్ని ఎత్తుకున్నారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవని పవన్ కు ఏ కేంద్ర సంస్థ వివరాలు ఇచ్చిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
అదేవిధంగా... ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీమ కు ఎంతో చేశారని రోజా తెలిపారు. ఆడపిల్ల తండ్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వారి రక్షణ, సాధికారత గురించి పరితపిస్తుంటారని అన్నారు. ఇక ఈ విషయాల పై పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఎన్ని సార్లు మాట్లాడినా గురివిందగింజ సామెత గుర్తుకొస్తుందని రోజా సెటైర్స్ వేశారు.
కాగా... రాజధాని ప్రాంతం లో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి శుక్రవారం... చంద్రబాబు - పవన్ ఇద్దరిపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు!