'ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిళ'... రోజా ఆసక్తికర వ్యాఖ్యలు!
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా స్పందించారు.
By: Tupaki Desk | 27 Dec 2023 11:22 AM GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో వరుసగా, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం.. ఏపీలోని ఆ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపుతోంది. దీంతో... వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ సత్తా చాటుతామనే ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశగా పార్టీని బలోపేతం చేయడంపై అధినాయకత్వం దృష్టి పెట్టిందని అంటున్నారు.
ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగిస్తారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల్లో వాస్తవం పాళ్లు ఎంతశాతం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ కథనాలకు అనుగుణంగా రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిళ ఎంట్రీ అనే విషయంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా స్పందించారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిళ ఏపీ పాలిటిక్స్ లోకి వస్తే తమకేమీ ఇబ్బంది లేదని అన్నారు. ఇదే సమయంలో తాను గతంలో చాలాసార్లు చెప్పినట్లు అని మొదలుపెట్టిన రోజా... ఇది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ ఎవరైనా పార్టీ పెట్టొచ్చని, ఎవరైనా మేనిఫెస్టో ఇచ్చుకోవచ్చని, ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు అని అన్నారు.
అయితే... వారు చెప్పే జెండా, అజెండా అనేది ప్రజలకు నమ్మశక్యంగా ఉన్నప్పుడే ప్రజలు మద్దతు పలుకుతారని అన్నారు. ఇదే సమయంలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్ మోహన్ రెడ్డిది కాదనే విషయం ఇప్పటికే అర్ధమై ఉంటుందని రోజా తెలిపారు. ఈ సందర్భంగా మరోసారి రజనీకాంత్ డైలాగును గుర్తుచేశారు.
గతంలో నగరిలో జరిగిన బహిరంగ సభలో రజనీకాంత్ డైలాగ్ అంటూ జగన్ ముందే ఆ డైలాగ్ చెప్పిన రోజా... మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా... "విమర్శించని నోరూ ఉండదు - మొరగని కుక్కా ఉండదు - మనపని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే.. అర్ధమైందా రాజా?" అని చెప్పిన రోజా... జగన్ గారు అదే సూత్రాన్ని పాటిస్తుంటారని తెలిపారు! ఆ విషయాని ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టే... జగన్ కు సపోర్ట్ గా ఉంటున్నారని తెలిపారు.
కుప్పం కోసం బాబు ప్రయత్నం!:
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీ పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని.. పవన్ కల్యాణ్ తో జతకలిసినా కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. జగన్ వైనాట్ 175 అనడంతో... కనీసం కుప్పాన్ని అయినా కాపాడుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు నిమగ్నమయ్యారని అన్నారు. 40 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పాంలో ప్రతీ ఇంటికీ మంచి నీళ్లు ఇవ్వలేని సమర్ధత చంద్రబాబు సొంతం అన్నట్లుగా రోజా విమర్శించారు!