రోజా సీటుకు సీనియర్ మంత్రి మోకాలడ్డు...?
ఆయన వర్గం రోజాను వ్యతిరేకిస్తోంది. వారికి కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు పెద్దిరెడ్డి ఇప్పించి ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 22 Aug 2023 11:30 PM GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పరిస్థితి రచ్చ గెలిచినా ఇంట గెలవలేని పరిస్థితి అని అంటున్నారు. ఆమె తన వాక్చాతుర్యంతో ప్రత్యర్ధులను కడిగి పారేస్తారు. ఆమె వాగ్దాటికి ప్రత్యర్ధులు బెంబేలెత్తుతారు. అమె తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పార్టీ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రిగా ఆమెకు ఎన్ని మార్కులు పడ్డాయన్నది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. అయితే రోజా మంత్రిగా మంచి పదవి దక్కించుకున్నారు అంటే అది జగన్ కి ఆమె పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్ అని భావించాలి.
అయితే 2024 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం విషయంలో మాత్రం జగన్ ఈ సాఫ్ట్ కార్నర్ తో అసలు ఉండరని అంటున్నారు. వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్ కి ప్రతీ సీటూ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. అలాంటిది రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి సీటులో ఆమె గెలుపు అవకాశాల మీద పార్టీ మధింపు చేయకుండా ఎలా ఉంటుంది అన్నది చర్చకు వస్తోంది. అదే టైం లో రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రత్యర్ధులు ఎక్కువ.
ఆమె వర్గ పోరుని నిలువరిస్తూ అందరికీ కలుపుకుని పోయి ఉంటే జగన్ టికెట్ విషయం పరిశీలించే వారూ అని అంటున్నారు. అయితే మూడు గ్రూపులుగా నగరిలో వైసీపీ చీలి ఉంది. అక్కడ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి పట్టు ఉంది. ఆయన వర్గం రోజాను వ్యతిరేకిస్తోంది. వారికి కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు పెద్దిరెడ్డి ఇప్పించి ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పెద్దిరెడ్డికి రోజాకు ఎక్కడ చెడిందో కానీ ఈ ఇద్దరి మధ్య బిగ్ గ్యాప్ ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ ని రోజాకు ఇవ్వరాదని పెద్దిరెడ్డి భావిస్తున్నారు అని అంటున్నారు. ఆ సీటుని తన వర్గానికి చెందిన బీసీ నేతకు ఇప్పించుకోవాలని ఆయన చూస్తున్నారు అని తెలుస్తోంది.
ఇక పెద్దిరెడ్డి మాట జగన్ వద్ద కచ్చితంగా చెల్లుతుంది అని అంటున్నారు. ఆయన అంటే అంత నమ్మకంగా జగన్ ఉంటారు. ఆయనకు ఏకంగా రాయలసీమ నాలుగు జిల్లాలను జగన్ అప్పగించారు అంటేనే అర్ధం చేసుకోవాలి. పెద్దిరెడ్డి మాటకు వ్యతిరేకంగా జగన్ రోజాకు నగరి టికెట్ ఇస్తారా అన్నది చర్చకు వస్తున్న విషయం. ఇక రోజా చూస్తే జగనన్న మీదనే భారం వేశారు. తనకు జగన్ కచ్చితంగా టికెట్ ఇస్తారని ఆమె భావిస్తుననరు.
అయితే జగన్ మాత్రం అక్కడ ఎమ్మెల్యేగా రోజా పనితీరుని కొలమానంగా తీసుకుంటారు అని అంటున్నారు. అదె విధంగా పార్టీ ఎంతవరకూ ఆమెకు సహకరిస్తుంది అన్నది చూస్తారు అని అంటున్నారు. ఆ మీదట పెద్దిరెడ్డికి ఎటూ చిత్తూరు జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగిస్తారు కాబట్టి ఆయన నుంచి కూడా సలహా సూచనలు తీసుకుంటారని అంటున్నారు. ఈ మూడూ కూడా ఇపుడు రోజాకు వ్యతిరేకంగా ఉన్న వేళ ఈ నెల 28న నగరిలో ముఖ్యమంత్రి జగన్ అడుగుపెడుతున్నారు. అక్కడ ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
అయితే ఇదే సభలో రోజా సీఎం నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు తగిన హామీని పొందాలని చూస్తున్నారు. ఆమె ఒక విధంగా తన జన బల ప్రదర్శన చేస్తున్నారు అని అంటున్నారు. అయితే రోజా ఎంత బల ప్రదర్శన చేసినా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కటాక్షం లేకపోతే సీటు దక్కదు అని అంటున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి వర్సెస్ రోజాగా ఇష్యూ మారింది. జగన్ కచ్చితంగా పెద్దిరెడ్డి వైపే మొగ్గు చూపుతారు అని అంటున్నారు. దాంతో టికెట్ విషయంలో జగన్ ఏ రకమైన హామీని ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి రోజా ఏ విధంగా అధినేత జగన్ మన్ననలు అందుకుని టికెట్ దక్కించుకుంటారో.