ఈ టైంలో ఈ తప్పులు అవసరమా రోజా?
ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఇదేం పని? అంటూ ప్రశ్నిస్తున్నారు
By: Tupaki Desk | 3 Jan 2024 6:35 AM GMTమనం వేలెత్తి చూపించేటప్పుడు ఒక వేలు ఎదుటోడి వైపు ఉంటే.. మిగిలిన నాలుగు వేళ్లు మనవైపు చూస్తుంటాయన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. మిగిలిన వారి కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర ఆగ్రహావేశాల్ని ప్రదర్శిస్తూ.. బెలెడన్ని మాటలు అనేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు. అలాంటి తీరు కీలక స్థానాల్లో ఉన్న వారైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నారు.
ఆమె తీరు.. ఏపీ అధికారపక్షానికి తలనొప్పిగా మారిందంటున్నారు కొంత మంది . కొత్త సంవత్సర వేడుకల వేళ.. ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా బెంగళూరులో ఒక పబ్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో మూడు నెలల్లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏదో ఒక రచ్చ చేస్తూ.. నిత్యం ప్రభుత్వానికి ఏదో ఒక సవాలు విసురుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అసమ్మతిని ఎదుర్కొంటున్న మంత్రి రోజా.. అలాంటి అంశాల మీద ఫోకస్ చేసి.. పార్టీకి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఆమె వ్యవహరిస్తున్న తీరును పలువురు సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరులోని ఒక హైక్లాస్ పబ్ లో ఆమె వెళ్లటం ఒక ఎత్తు అయితే.. అక్కడ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఇదేం పని? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అంగన్ వాడీ కార్యకర్తలు.. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా కొన్ని వర్గాల వారు ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు విపక్షాలు ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేస్తూ.. జగన్ సర్కారును ఇరకాటంలో పడేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వేళలో.. వ్యక్తిగతంగా వెళ్లినప్పటికి మంత్రిగా వ్యవహరిస్తున్న రోజా.. పక్క రాష్ట్ర రాజధాని పబ్ కు వెళ్లి డ్యాన్స్ చేయటాన్ని తప్పు పడుతున్నారు.ఈ తీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందన్న చిన్న విషయాన్ని ఆమె ఎలా మిస్ అవ్వుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.