ఫ్లై ఓవర్లపై వరుసగా కార్లు పార్కింగ్... ఎందుకో తెలుసా?
అయితే... ఫ్లై ఓవర్లపైనే వరుసగా కార్లు పార్కిం చేసిన ఘటన చెన్నైలో తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 15 Oct 2024 9:24 AM GMTసాధారణంగా వాహనదారులు పక్కనే ఉన్న షాప్ లో ఉన్న చిన్నపని చూసుకుని వచ్చేద్దామని.. రోడ్లపక్కనే వాహనాలు పార్క్ చేస్తుంటారు. ఈలోపు ట్రాఫిక్ పోలీసులు చూస్తే జరగాల్సింది జరుగుతుంది. అయితే... ఫ్లై ఓవర్లపైనే వరుసగా కార్లు పార్కిం చేసిన ఘటన చెన్నైలో తెరపైకి వచ్చింది. అందుకు కారణం... ప్రభుత్వం ప్రకటించిన బిగ్ అలర్ట్!
అవును... చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో... గతానుభవాలను దృష్టిలోపెట్టుకుని ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా... వెలచేరి పరిసర ప్రాంతాల నివాసితులు తమ కార్లను ఫ్లై ఓవర్లపై పార్క్ చేస్తున్నారు. దీంతో... ఫ్లై ఓవర్స్ అన్నీ కార్లతో నిండిపోతున్నాయి!
అయితే... విషయం తెలియకో.. తెలిసినా రూల్స్ రూల్సే అనో కానీ... వరదలకు భయపడి ఫ్లై ఓవర్లపై పార్క్ చేసిన కార్లకు చలాన్ రాయడం మొదలుపెట్టారు ట్రాఫిక్ పోలీసులు! అయితే... ఆ చలాన్ లను లైట్ తీసుకుంటూ.. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణం ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు మాత్రం తగ్గడంలేదు!
మరోపక్క వాతావరణ కేంద్రం సమాచారంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం స్పందించారు. మంగళవారం చెన్నై చుట్టుపక్కల జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చామని తెల్లిపారు. మిగిలిన జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటారని తెల్లిపారు. చెన్నైలో పడవలు సిద్ధంగా ఉంచామని అన్నారు.
ఇదే సమయంలో లోతట్టు ప్రాంతల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని.. చెన్నై వ్యాప్తంగా 300 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. గతంలో ఎక్కడెక్కడ నీరు నిలిచిందో.. అక్కడ అన్ని చోట్లా మోటార్లు సిద్ధం చేశామని అన్నారు.
పలు ఆదేశాలు జారీచేసిన స్టాలిన్:
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రాంతీయ వాతావరణ కేంద్రం. దీంతో అలర్ట్ అయిన సీఎం స్టాలిన్... జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా... 15న చెన్నై, కాంచీపురాం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించాలని.. 15 నుంచి 18 వరకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశించాలని తెలిపారు. ఇదే సమయంలో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని సూచించారు!
అత్యవసర వస్తులుల ధరలు పెరగకుండా ఆహార శాఖ చర్యలు తీసుకోవాలని.. ఆవిన్ సంస్థ ద్వారా అంతరాయం లేకుండా పాలు, పాల ఉత్పత్తుల వినియోగం కొనసాగించాలని సూచించారు. పునరావాస శిబిరాలను సిద్ధం చేయాలని.. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.