ఏపీ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్.. నాటు నాటు...వెరీ ఇంట్రెస్టింగ్
అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట రావడంతో వైరల్ అయింది.
By: Tupaki Desk | 14 Nov 2024 4:20 PM GMTరాష్ట్ర శాసనసభలో రాజమౌళి అద్భుత సృష్టి అయిన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి అందులోని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట గురించి ప్రస్తావన వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట రావడంతో వైరల్ అయింది. అసెంబ్లీలో ఉప సభాపతిగా రఘురామ క్రిష్ణం రాజుని ఆసీనులు చేసిన సందర్భంగా సభా నాయకుడి హోదాలో ప్రసంగం చేసిన చంద్రబాబు తన మాటలలో ఎన్నో పంచులు వేశారు. వైసీపీకి ఘాటైన కౌంటర్లు వేసారు.
వైసీపీ రెబెల్ ఎంపీగా రఘురామ కొన్ని ఏళ్ల పాటు ఢిల్లీలో ఠంచనుగా రచ్చబండ పేరిట కార్యక్రమం పెట్టి నాటి జగన్ పాలన మీద చెడుగుడు ఆడేవారు. అది ఎంతో వైరల్ అయింది. దాని గురించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రస్తావిస్తూ రాజకీయాల్లో ట్రిపుల్ ఆర్ గా రఘురామ ఉన్నారని కితాబు ఇచ్చారు.
సినిమాల్లో ట్రిపుల్ ఆర్ ఒక సంచలనం అన్నారు. ఆ సినిమా ఇండియా బోర్డర్ దాటి ప్రపంచ సినిమాగా మారి ఆస్కార్ గెలుచుకుందని అలాగే ఏపీ పాలిటిక్స్ లో ట్రిపుల్ ఆర్ కూడా ఒక సెన్సేషన్ నై అన్నారు. ఆయనను అధ్యక్షా అని సభోదిస్తూ బాబు మీరు స్పీకర్ స్థానానికి తగిన వారు అని కితాబు ఇచ్చారు.
ఇక ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాట ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అని అన్నారు. అదే విధంగా రఘురామ రచ్చబండ కూడా అప్పటికి అప్పుడు సూపర్ హిట్ అవుతూ వచ్చిందని ప్రతీ రోజూ అది సూపర్ హిట్ గానే సాగిందని అన్నారు. ఏకంగా వైసీపీ ప్రభుత్వం మీద తనదైన శైలిలో రఘురామ చేసిన పోరాటం రచ్చ బండ రూపంలో అప్పట్లో మూడేళ్ల పాటు ఒక డైలీ సీరియల్ గా మారిందని చంద్రబాబు చెప్పారు.
నాటి వైసీపీలో జరిగే అనేక అంశాలు తెర చాటు వ్యవహారాలు అన్నీ కూడా రఘురామ పూసగుచ్చినట్లుగా వివరించడంతో ప్రజలు ఎంతో ఆసక్తితో ప్రతీ రచ్చబండ ప్రోగ్రాం కోసం చూసేవారు అని అన్నారు. ఆనాటి సీఎం జగన్ విసిరిన అనేక సవాళ్ళను తట్టుకుని నెగ్గుకుని రావడం అంటే సామాన్య విషయం కదని దానిని రఘురామ సక్సెస్ ఫుల్ గా చేశారని ఆయన ఈ రోజు ఉప సభాపతి పోస్టులో ఉన్నారు అంటే అది ఘన విజయమానికి గుర్తు అన్నారు. రఘురామ తన పదవిలో ప్రజలకు రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాక్షించారు..
ఇదిలా ఉండగా స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా రఘురామ ఎన్నిక అయినట్లుగా ప్రకటించడంతో రఘురామ తన సీటు నుంచి వచ్చి బాబుకు పాదాభివందనం చేశారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ ని హత్తుకున్నారు. ఆ ఇద్దరు తనను తోడ్కొని తీసుకుని రాగా ఆయన స్పీకర్ చెయిర్ లో కూర్చున్నారు. మొత్తానికి రఘురామకు తగిన హోదా లభించింది అని అంటున్నారు.