ఆ వివాదాస్పద అధికారిపై చంద్రబాబుకు ఆర్‌ఆర్‌ఆర్ ఫిర్యాదు!
ముఖ్యంగా నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ తనను కొట్టారని.. దాన్ని వీడియో తీయించి వైసీపీ పెద్దలకు పంపారని రఘురామ ఆరోపించారు.
By: Tupaki Desk | 30 Sep 2024 9:30 AM GMTవైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తో విభేదించినందుకు తనను అరెస్టు చేసి కస్టడీలో సీఐడీ పోలీసులు చితకబాదారని నాటి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ముఖ్యంగా నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ తనను కొట్టారని.. దాన్ని వీడియో తీయించి వైసీపీ పెద్దలకు పంపారని రఘురామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పీవీ సునీల్ కుమార్, నాటి సీఐడీ డీఎస్పీ విజయ్ పాల్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, తనకు గాయాలు కాలేదని తప్పుడు నివేదిక ఇచ్చారంటూ గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిలపైన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
ఈ కేసులో పోలీసులు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీఐడీ విభాగం మాజీ అధిపతి పీవీ సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే పోలీసు కస్టడీకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్‌ఆర్‌ఆర్ లేఖ రాశారు.
వైసీపీ పాలనలో తనను కస్టడీలో హింసించడం, దానిలో గుర్తించిన అంశాలపై సెప్టెంబర్ 27న ఈనాడు పత్రికలో కథనం ప్రచురితమైందని «రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ మర్నాటి (సెప్టెంబర్ 28) నుంచి పీవీ సునీల్ కుమార్.. కేసులో కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరిస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు.
తన ఫిర్యాదు మేరకు పీవీ సునీల్ కుమార్, నాటి విభాగాధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, నాటి సీఎం జగన్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతి, మరికొందరిపై గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో జులై 11న హత్యాయత్నం కేసు నమోదైందని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారని తెలిపారు. తన నుంచి, పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారన్నారు. ఈ క్రమంలో నాలుగో నిందితుడైన విజయ్ పాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని రఘురామ తెలిపారు. ఇప్పుడు సునీల్ కుమార్ సాక్షుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని చంద్రబాబుకు రాసిన లేఖలో ఆర్‌ఆర్‌ఆర్ కోరారు.