Begin typing your search above and press return to search.

ఇదేందయ్యా ఇది అసలు ఊహించలా.. ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఘన స్వాగతం!

దీంతో రఘురామరాజు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత ప్రాంతానికి విచ్చేశారు. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి వరకు ఆయన విమానంలో వచ్చారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 12:19 PM GMT
ఇదేందయ్యా ఇది అసలు ఊహించలా.. ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఘన స్వాగతం!
X

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి తెలియనివారెవరూ లేరు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆయనకు వైసీపీ అధిష్టానంతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 20కి మించి అసెంబ్లీ స్థానాలు రావని ఆర్‌ఆర్‌ఆర్‌ తేల్చిచెబుతున్నారు.


మరోవైపు వైసీపీ ప్రభుత్వం రఘురామరాజుపై పలు కేసులు నమోదు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర చేశారని, ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ పై దాడికి పాల్పడ్డారని ఇలా పలు కేసులు ఆయనపై నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. స్వయంగా తనను కొడుతూ తీసిన వీడియోను సీఐడీ అధికారులు వైఎస్‌ జగన్‌ కు పంపారని రఘురామ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

గత ఎన్నికల్లో గెలిచింది మొదలు రఘురామ ఒకటి రెండుసార్లు మినహా రాష్ట్రానికి వచ్చింది లేదు. తాను ఏపీలో అడుగుపెట్టడం ఆలస్యం జగన్‌ ప్రభుత్వం తనపై ఏదో కేసు నమోదు చేస్తోందని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ రక్షణ సైతం పొందారు. తాజాగానూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. సంక్రాంతి పండుగ కోసం తాను భీమవరం వస్తున్నానని.. జగన్‌ ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనను అరెస్టు చేయొద్దని.. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో రఘురామరాజు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత ప్రాంతానికి విచ్చేశారు. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి వరకు ఆయన విమానంలో వచ్చారు. దీంతో రాజమండ్రి విమానాశ్రయం ఆర్‌ఆర్‌ఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులతోపాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై రఘురామకృష్ణరాజుకు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి, పాలకొల్లు, ఆచంటల మీదుగా భారీ కార్ల కాన్వాయ్‌ తో, ర్యాలీతో ఆర్‌ఆర్‌ఆర్‌ ముందుకుసాగారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. నాలుగేళ్ల తరువాత సొంత ప్రాంతానికి రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. మాటల్లో చెప్పలేనంత అనుభూతి అని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ అందించిన సహకారం జీవితంలో మరవలేనని వెల్లడించారు. అభిమానులు, తెలుగుదేశం, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో మరవబోనని స్పష్టం చేశారు.

సొంతవారు ఎవరో, పరాయి వారు ఎవరో తనకు అర్థమవుతోందని రఘురామకృష్ణరాజు భావోద్వేగానికి గురయ్యారు. తన నానమ్మ చనిపోయినప్పుడు కూడా తాను ఊరికి రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రానీయకుండా ఉండటానికి చాలా ప్రయత్నించారని ఆరోపించారు. కోర్టు రక్షణ కల్పించాలని ఆదేశించడంతో వచ్చానన్నారు. పోలీసులు కూడా చాలా సహకరించారని తెలిపారు.