ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు : ఆర్ఎస్పీ దూకుడు
ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు రూ.53 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై ఏసీబీ విచారిస్తుండగా, ఈడీ కూడా రంగంలోకి దిగింది.
By: Tupaki Desk | 28 Jan 2025 10:44 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు ప్రవీణ్ కుమార్.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు రూ.53 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై ఏసీబీ విచారిస్తుండగా, ఈడీ కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి అనాలోచితంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.
"నేను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ ఆఫీసరుగా పనిచేశా.. క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా, అడిషనల్ డీజీపీగా.. వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశా.. కానీ ఎక్కడా ఇటువంటి కేసు చూడలేదు". అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లిస్తే ఈ కార్ రేసు నిర్వహించిన సంస్థ ఆ డబ్బు స్వీకరించినట్లు చెబుతోంది. ఇక ఇందులో అవినీతి ఎక్కడుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.