ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిగ్ షాకిచ్చిన సోదరుడు!
ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీతో ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 10 April 2024 7:56 AM GMTఐపీఎస్ అధికారిగా ఉంటూ వివిధ బాధ్యతలు నిర్తర్తించిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి గత తెలంగాణ ఎన్నికల ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరిన సంగతి తెలిసిందే. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీతో ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకున్నారు. దీనికి బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒప్పుకోకపోవడంతో ఆయన ఏకంగా బీఆర్‌ఎస్ లోనే చేరిపోయారు. ఆ పార్టీ తరఫున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు.
ఈ క్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిగ్ షాక్ తగులుతోందని తెలుస్తోంది. ఆయన సోదరుడు ప్రసన్నకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్‌ఎస్ లో ప్రవీణ్ కుమార్ చేరిన కొద్ది రోజులకే నాగర్ కర్నూల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు సంభవించాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో తన అన్న ప్రవీణ్ కుమార్ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ మనస్తాపానికి గురయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ప్రసన్నకుమార్ అనుచరులు చెబుతున్నారు.
ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రసన్నకుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయిన సంగతి తెలిసిందే.
తన ప్రత్యర్థి చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడంతోనే ప్రసన్నకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై స్పష్టత్స రావాల్సి ఉంది.