తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఎస్పీతో బీఆర్‌ఎస్ పొత్తు!?
వీరి మధ్య తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత పరిణామాలు, వచ్చే పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో చర్చలు జరిగాయని అంటున్నారు
By: Tupaki Desk | 5 March 2024 11:36 AM GMTతెలంగాణలో వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్ పార్టీ.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తుకు స్నేహహస్తం చాచుతోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దళితుల్లో ఒక వర్గానికి చేరువ కావాలని చూస్తోంది. అంతిమంగా పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎత్తులు వేస్తోంది.
తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో తాజాగా సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వీరి మధ్య తెలంగాణ రాజకీయాలు, ప్రస్తుత పరిణామాలు, వచ్చే పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో చర్చలు జరిగాయని అంటున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఉండబోతోందని తెలుస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాలను పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్ కు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో ఉండరని అంటున్నారు. ఇక మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని.. బీఎస్పీ పోటీ చేయకుండా బీఆర్‌ఎస్ కు మద్దతు ఇస్తుందని పేర్కొంటున్నారు.
పొత్తుల్లో భాగంగానే హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా బీఆర్‌ఎస్ పోటీ పెట్టదని అంటున్నారు. బీఆర్‌ఎస్, బీఎస్పీ, ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని సమాచారం.
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ సమీక్షించారు. అదే సమయంలో బీఎస్పీ అధినేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడకు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రవీణ్ కుమార్ కూడా ఓటమిపాలయ్యారు. ఈసారి తన సొంత నియోజకవర్గం ఉన్న ఆలంపూర్ ఉన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగాలని ఆశిస్తున్నారని టాక్.
కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఆకస్మాత్తుగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తోంది బీఆర్‌ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్–బీఎస్పీ కలిసి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు. అయితే ఇలాగే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలను వాడుకుని కేసీఆర్ లాభపడ్డారు. ఆ తర్వాత వారిని గాలికొదిలేశారు. ఈసారి ఇదే పరిస్థితి బీఎస్పీకి ఎదురుకావచ్చని అంటున్నారు.