పిల్లలను కనాల్సిందే...పొంచి ఉన్న ముప్పు!
వీటిని అన్నింటినీ చెబుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశం లాంటి దేశాలో ప్రతీ ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని బలమైన నినాదం ఇచ్చారు.
By: Tupaki Desk | 1 Dec 2024 9:30 PM GMTఇపుడు సరికొత్త నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. జపాన్ చైనా లాంటి దేశాలు అయితే దీనినే ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నాయి. ప్రభుత్వం పరంగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ పోతున్నాయి. మరో వైపు రష్యా తీసుకుంటే ఆ దేశ జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జనాభా పెరుగుదలకు ఆ దేశం అన్ని చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అంటూ కొత్త మంత్రిత్వ శాఖను రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇలా ప్రపంచం అంతా పిల్లలు కావాలి మానవ వనరులు పెరగాలి అని కోరుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా దూరదృష్టితోనే ఆలోచించారు. ఆయన తరచూ ఇదే మాట చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని కూడా ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు ఉంటేనే అన్న షరతుని ఎత్తేసి ఎంత మంది ఉన్నా ఓకే అంటూ ఇటీవల చట్ట సవరణ తెచ్చారు.
ఇపుడు చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ నినాదం అందుకుంది. దేశంలో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖం పడుతోంది అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. జనాభా రేటు తగ్గిపోతోంది. ఇది అత్యంత ప్రమాదం అని ఆయన అంటున్నారు. ఇదే కనుక జరిగితే కొన్ని నాగరికతలు అనేక భాషలు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఇక భారతదేశమో జనాభా రేటు విధానాన్ని 1998 ప్రాంతంలో నిర్ణయించారు. దాని ప్రకారం చూస్తే 2.1 కంటే తక్కువ ఉండరాదు అని స్పష్టం చేశారు అని ఆయన పేర్కొన్నారు. సమాజ మనుగడకు కానీ దేశ శ్రేయస్సుకు కానీ జనాభా శస్త్రం పరంగా కానీ తీసుకుంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండాల్సిందే అని ఆరెస్సెస్ చీఫ్ ఖండితంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే జనాభా రేటు తగ్గితే ఏమి జరుగుతుంది అంటే మానవ వనరులు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అని జనాభా పరిశోధన నిపుణులు చెబుతున్నారు. భారత్ లాంటి దేశాలలో మహిళల సంతానోత్పత్తి రేటు గత అర్ధ శతాబ్ద కాలంగా గణనీయంగా తగ్గి పోతూ వస్తోందని పరిశోధనలో తేల్చాయి.
వెనక్కి వెళ్ళి చూస్తే కనుక 1950 ప్రాంతంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు జీవిత కాలంలో 4.7 గా ఉండేది అని గుర్తు చేస్తున్నారు. అది అలా తగ్గుతూ 2017 నాటికి 2.4 శాతానికి పడిపోయింది అని అంటున్నారు. ఇది యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యూషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది అంటున్నారు.
ఇక ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 2100 నాటికి అంటే ఇప్పటికి మరో డెబ్బయి అయిదేళ్లకు జనాభా వృద్ధి రేటు 1.7 శాతానికి పడిపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక 2064 నాటికి ఈ ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక 2100 నాటికి 880 కోట్లకు పడిపోతుందటా. అంటే ఒక్కసారిగా 90 కోట్లు తగ్గుదల అన్న మాట. ఇపుడు అధిక జనాభా అని అంతా అంటున్న పరిస్థితి నుంచి జనాలు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే దారుణమైన పరిస్థితులు కూడా వస్తాయంట.
వీటిని అన్నింటినీ చెబుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశం లాంటి దేశాలో ప్రతీ ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని బలమైన నినాదం ఇచ్చారు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టి ఏదైనా చట్టం తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.