Begin typing your search above and press return to search.

ఆరెస్సెస్ ఆశీస్సులతోనే అంతా తారు మారు !

అందుకే వారు బీజేపీలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యం కూడా ఆరెస్సెస్ నుంచే.

By:  Tupaki Desk   |   9 Jun 2024 1:40 PM GMT
ఆరెస్సెస్ ఆశీస్సులతోనే అంతా తారు మారు  !
X

బీజేపీకి మాతృ సంస్థ ఆరెస్సెస్ ఉంది. ఆ సంస్థ రాజకీయ ముఖమే బీజేపీ. మొదట ఆరెస్సెస్ లో సేవకులుగా చేరి పనిచేసి వారు ఆ తరువాత కాలంలో బీజేపీలో చేరి ప్రజా జీవితంలోకి వస్తారు. అలాంటి వారికి పెద్ద పీట వేసి పదవులు అప్పచెప్పే సంప్రదాయమే బీజేపీలో మొదటి నుంచి ఉంది. అటల్ బిహారీ వాజ్ పేయి ఎల్ కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ వెంకయ్యనాయుడు సహా ఎంతోమంది నేతల నేపథ్యం అంతా ఆరెస్సెస్ నుంచే.

అందుకే వారు బీజేపీలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యం కూడా ఆరెస్సెస్ నుంచే. ఆయన ఏకంగా మూడున్నర దశాబ్దాల పాటు ఆరెస్సెస్ లో పనిచేసి ఆ తరువాత బీజేపీలోకి వచ్చారు.

ఇవన్నీ ఎందుకు అంటే ఆరెస్సెస్ పునాది మీదనే బీజేపీ భవనం నిర్మితం అవుతూ వస్తోంది. అయితే మోడీ హయాంలో మాత్రం ఆరెస్సెస్ ప్రాతినిధ్యం తగ్గింది అన్న మాట ఉంది. ముఖ్యంగా మంత్రి పదవులు అందుకున్న వారిలో అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇస్తూ పోయారు

దాని వల్ల బీజేపీ కార్పొరేట్ శక్తులకు నిలయం అనే భావన ఏర్పడింది. అయితే ఆ భావనను తొలగించాలన్న ఉద్దేశ్యంతోనే ఆరెస్సెస్ కంకణం కట్టుకుంది. ఈసారి మాత్రం ఆరెస్సెస్ జోక్యం మోడీ మంత్రి వర్గం కూర్పులో కనిపిస్తోంది. దాదాపుగా మూడున్నర దశాబ్దాలు క్రితం ఆరెస్సెస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాసవర్మకు అనూహ్యంగా నరసాపురం లోక్ సభ టికెట్ దక్కడం వెనక ఆరెస్సెస్ ఉంది.

అలాగే ఆయన ఇలా గెలిచి అలా రాగానే ఏకంగా కేంద్ర మంత్రిని చేయడం వెనక కూడా ఆరెస్సెస్ దీవెనలు ఉన్నాయి. దాంతో ఏపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో బీజేపీ తొలి ప్రాధాన్యత ఏమిటి అన్నది అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఎంపీల సంఖ్య కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చినా మంత్రి పదవుల విషయంలో మాత్రం బీజేపీ ఆరెస్సెస్ చాలా శ్రద్ధగా అన్నీ చూసే ఎంపిక చేసాయని అంటున్నారు.

ఇక తెలంగాణాలో తీసుకుంటే ఇద్దరు కేంద్ర మంత్రులూ ఆరెస్సెస్ నేపధ్యం కలిగిన వారే కావడం విశేషం. కిషన్ రెడ్డి అయితే 1977 నుంచి ఆరెస్సెస్ లో పనిచేస్తూ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారు. ఆయన 2019లో సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో జరిగిన విస్తరణలో ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ పదవితో నియమితులయ్యారు

ఈసారి కూడా తొలి దఫాలోనే మోడీతో పాటే ఆయన ప్రమాణం చేయబోతున్నారు. అలాగే మరో ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన నేత కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్. ఆయన కూడా తన జీవితంలో సగం భాగం ఆరెస్సెస్ కే కేటాయించారు. కరీంనగర్ నుంచి 2019లో గెల్చిన ఆయనకు ఇది రెండవసారి గెలుపు. గతంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు అని వినిపించినా అది జరగలేదు. కానీ ఈసారి మాత్రం నిజం అవుతోంది. దాంతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నిర్ణయించింది.

అలా ఈటెల రాజేంద్ర కేంద్ర మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనను తెలంగాణా బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అదే టైం లో ఏపీలో దగ్గుబాటి పురంధేశ్వరికి స్పీకర్ పదవి అంటున్నారు. కానీ అది దక్కకపోతే ఆమె పార్టీ ప్రెసిడెంట్ గానే మరింత కాలం పనిచేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ ఈసారి ఎన్నికల్లో దెబ్బ తినడానికి పార్టీ పునాదులు బలహీనం కావడానికి కారణాలు అన్వేషిస్తూ తిరిగి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నే నమ్ముకుందని అంటున్నారు.