Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ.. రూల్స్ ఇవే!

శనివారం మధ్యాహ్నం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సరే.. ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు టికెట్ల తీసుకోకుండా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:02 AM GMT
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ.. రూల్స్ ఇవే!
X

అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వసతిని కల్పిస్తామంటూ.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ హామీని ప్రభుత్వం కొలువు తీరిన మూడో రోజునే అమలు చేయటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ గ్యారెంటీని శనివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర (1.30 గంటలకు)కు తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తి చేశారు.

శనివారం మధ్యాహ్నం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సరే.. ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు టికెట్ల తీసుకోకుండా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు. మరి.. ఈ ఫ్రీ జర్నీ ఎన్ని కిలోమీటర్లు? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకుంటే.. ఎన్ని కిలోమీటర్లు అయినా ఉచితమే. తెలంగాణ పొలిమేరల్లో ఉన్నంతవరకు ఏ మహిళకైనా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ జెండర్లకు కూడా అవసరం లేదని తేల్చేశారు.

ఈ పథకం అమలు వేళ.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగటం వల్ల.. తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చెప్పటంతో పాటు.. ఎలాంటి విసుగును ప్రదర్శించకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆర్టీసీ ఉద్యోగులకు హితబోధ చేశారు. అంతేకాదు.. మొదటి వారం.. పది రోజుల వరకు కూడా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అడగాల్సిన అవసరం లేదని కండక్టర్లకు సూచన చేశారు.

ఉచిత టికెట్లు ప్రింట్ అవుతున్నాయని.. ఈ కారణంగా మూడు నాలుగు రోజుల వరకు జీరో టికెట్లు ఇవ్వకుండానే ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. వారంలో జీరో టికెట్లు వస్తాయని.. అప్పుడు వాటిని ఇవ్వటం మొదలు పెట్టాలన్నారు. మహలక్ష్మీ పథకంలో భాగంగా పల్లెవెలుగు.. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు. అదే విధంగా హైదరాబాద్ లో మెట్రో లైనర్ల వరకు కూడా ఉచితమే. ఒక్క ఏసీ బస్సులు.. రాజధాని బస్సుల్లో మాత్రం ఉచితాన్ని అమలు చేయరు.

ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సుల్లో ఎక్కే మహిళలకు టికెట్ ఉచితమే. కాకుంటే తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు వరకు మాత్రమే. ఆ తర్వాత టికెట్ ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉచితంగా తీసుకెళుతున్నాం కాబట్టి.. సిబ్బంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడొద్దని పదే పదే చెప్పటం కనిపించింది. అంతేకాదు.. మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాల్ని విడుదల చేయటం గమనార్హం. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్సుల్ని పెంచుతామని చెప్పిన అధికారులు.. ఇప్పుడున్న 7200సర్వీసుల్ని వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రయాణం చేసే మహిళలకు సంబంధించిన సంఖ్యను కండెక్టర్లు తప్పనిసరిగా లెక్కలు వేయాలని కోరారు. మొత్తంగా ఇచ్చిన గ్యారెంటీ హామీల్లో కీలకమైన అంశాన్ని మూడో రోజునే మొదలు పెట్టటం గమనార్హం.