Begin typing your search above and press return to search.

బెజవాడ సీపీకి సజ్జన్నార్ ఫోన్ చేశారెందుకు?

దీనికి సానుకూలంగా స్పందించిన విజయవాడ సీపీ రామక్రిష్ణ.. గరికపాడు చెక్ పోస్టు వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సులు ఏపీలోకి ప్రవేశించటానికి వీలుగా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   12 May 2024 4:32 AM GMT
బెజవాడ సీపీకి సజ్జన్నార్ ఫోన్ చేశారెందుకు?
X

యుద్ధానికి వెళుతున్నట్లుగా దేశంలోని వివిధ నగరాల నుంచి ఏపీకి వస్తున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఎంతలా అంటే.. పెద్ద పండుగల వేళలో ఎలా అయితే జాతీయ రహదారులు కిక్కిరిసిపోతాయో.. అదే తీరులో ఎన్నికల సందర్భంగా వాహనాలు బారులు తీరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలకు ముందు ఇంత భారీ సంఖ్యలో కార్లు రావటంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ దళాలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. మామూలుగా అయితే.. ప్రతి వాహనాన్ని చెక్ చేసిన తరవాతే పంపే పరిస్థితి. వేలాదిగా వస్తున్న వాహనాలన్నింటిని తనిఖీ చేయటం అసాధ్యం కావటతో.. వాటిని తనిఖీల్లేకుండానే పంపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా వందలాది బస్సుల్ని ఏర్పాటు చేసింది.

అవి కూడా సరిపోని పరిస్థితి. దీంతో.. అప్పటికప్పుడు డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నారు. అంతా బాగుంది కానీ.. ఏపీకి వెళుతున్న బస్సులు తీవ్రమైన ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోతున్న పరిస్థితి. దీంతో.. ఏపీకి వెళ్లి తిరిగి రావటం చాలా ఇబ్బందిగా మారింది.

దీంతో.. షెడ్యూల్ ఖరాబు అవుతున్న పరిస్థితి. విషయాన్నిఅర్థం చేసుకున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి బస్సుల్లో అత్యధికం విజయవాడ మీదుగా వెళుతున్న నేపథ్యంలో.. తమకు టోల్ వద్ద ప్రత్యేక లైన్ ఇవ్వాలని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన విజయవాడ సీపీ రామక్రిష్ణ.. గరికపాడు చెక్ పోస్టు వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సులు ఏపీలోకి ప్రవేశించటానికి వీలుగా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. దీంతో.. ట్రాఫిక్ జాంలో ఆర్టీసీ బస్సులు చిక్కుకోకుండా ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనే కాదు.. సికింద్రాబాద్ నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ రైళ్లు మొత్తం కిక్కిరిసిపోవటం చూస్తే.. ఏపీలో ఎన్నికల ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థమయ్యే పరిస్థితి.