ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం.. స్పెషల్ ఏంటంటే!
ఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 23 Feb 2024 1:30 PM GMTఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కమిషనర్లను నియమించింది. అయితే.. వీరిలో కొంత రాజకీయం, అదేసమయంలో ఓటు బ్యాంకు కు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్టీఐ కమిషనర్లుగా రెహానా బేగం, ఉదయ్ భాస్కర్ రెడ్డి, సునీల్‌లను ప్రభుత్వం నియమించింది.
వీరంతా.. మూడేళ్ల పాటు ఆర్టీఐ కమిషనర్లుగా కొనసాగేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వు లు విడుదల చేశారు. బాధ్యతల స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారని తెలిపారు. జర్నలిజం, వైద్యం, క్రీడా రంగాల్లోని ప్రముఖులకు ఆర్టీఐ కమిషనర్లుగా అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్ర విభజన తర్వాత తొలి మహిళా ఆర్టీఐ కమిషనరుగా రెహానా బేగంను నియమించడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఇదీ..రాజకీయ వ్యూహం?
అయితే.. ఆర్టీఐ కమిషనర్ల నియామకం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన నియామకంగా పేర్కొంటున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన రెహానాకు.. అవకాశం ఇవ్వడం ద్వారా వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రతిపక్షాల మాట. వాస్తవానికి ఇంతకన్నా సీనియర్లు ఆంధ్రభూమి, ఈనాడు వంటి పత్రికల్లో ఉన్నారు. వారిని ఏమాత్రం పరిగణనలోకితీసుకోకపోవడం గమనార్హం. కేవలం మైనారిటీ, మహిళ అనే రెండు కారణాలతో ఆమెకు అవకాశంఇచ్చారు.
ఇక, వైద్య రంగానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడుగా ఉదయ్‌భాస్కర్‌రెడ్డికి పేరుంది. పైగా సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా క్రీడా రంగానికి చెందిన సునీల్‌కు ఈ పదవిని ఇవ్వడంద్వారా.. యువతను వైసీపీ వైపు తిప్పుకొనే వ్యూహం ఉందని అంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టారని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా విశ్లేషిస్తారో చూడాలి.